Farmers Pension : రైతులకు మోదీ సర్కార్ గుడ్ న్యూస్.. నెలకు మూడు వేల పింఛను
రైతులకు తమ చివరి దశలో ఆర్థిక భరోసా కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం పెన్షన్ పథకం ప్రవేశపెట్టింది
రైతులకు తమ చివరి దశలో ఆర్థిక భరోసా కల్పించేంుకు కేంద్ర ప్రభుత్వం పెన్షన్ పథకం ప్రవేశపెట్టింది. నెలకు మూడు వేల రూపాయలు చెల్లిస్తుంది. వృద్ధాప్యంలో ఉండే రైతులకు ఈ పింఛను అందుతుంది. అరవై ఏళ్లు పైబడిన రైతులు మాత్రమే ఈ పింఛను పొందడానికి అర్హులని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. నేరుగా రైతుల ఖాతాల్లో పింఛను మొత్తం జమ అవుతుంది. వృద్ధాప్యంలో ఉన్న అన్నదాతలకు ఆసరా కల్పించేందుకు ప్రవేశపెట్టిన ఈ పథకాన్ని అందుకోవాలంటే ముందుగా నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. ప్రధానమంత్రి మాన్ ధన్ యోజన పథకం కింద మూడు వేల రూపాయలను నెలకు చెల్లించనుంది. చిన్న, సన్నకారు రైతులకు మాత్రమే ఈ పింఛను ను అందచేయనున్నారు.
అర్హతలివే...
ఈ పింఛను జీవితకాలం అందనుంది. ఇందుకు ప్రధానంగా ఐదు ఎకరాల్లోపు ఉన్న రైతులు అందరూ అర్హులే. వీరికి అరవై ఏళ్ల వయసు దాటి ఉండాలి. పీఎం కిసాన్ లబ్దిదారులు కూడా ఈ పింఛను పథకం కింద నమోదు చేసుకునే అవకాశముంది. కానీ పన్ను చెల్లించే వారు, ఆర్థిక స్థితి బాగా ఉన్నవారు, ఇతర సామాజిక భద్రత పథకాల పరిధిలో ఉన్న వారికి మాత్రం ఈ పథకం వర్తించదు. అయితే ఇందుకోసం ప్రతి రైతు పద్దెనిమిదేళ్ల వయసు నుంచి నలభై ఏళ్ల వయసున్న రైతులు ప్రతి నెల యాభై ఐదు రూపాయల నుంచి రెండు వందల రూపాయల ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. దీనికి కేంద్రం వాటాగా మరో యాభై ఐదు రూపాయలను జమ చేస్తుంది.
బీమా ప్రీమియం చెల్లిస్తే...
ఇరవై ఏళ్ల వయసున్న రైతులు 61 రూపాయలు, ఇరవై ఐదేళ్ల వయసున్న రైతులు ఎనభై రూపాయలు, ముప్ఫయి ఏళ్ల వయసున్న రైతులు 105 రూపాయలు, 35 ఏళ్ల వయసున్న వారు 150 రూపాయలు, నలభై ఏళ్ల వయసున్న వారు రెండు వందల రూపాయలు ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. అరవై ఏళ్ల తర్వాత రైతు మరణిస్తే అతని నామినీగా ఉన్న భార్యకు ప్రతి నెల పదిహేను వందల రూపాయలు జీవిత కాలం పింఛను మంజూరు చేస్తుంది. రైతులు తమ వయసులో ఎంత ప్రీమియం చెల్లిస్తే అంతే ప్రీమియంను కేంద్ర ప్రభుత్వం చెల్లిస్తుంది కాబట్టి బీమా సౌకర్యం కూడా కలుగుతుంది. రైతులు ఈ పథకం కింద దరఖాస్తు చేసుకుని జీవితానికి భరోసా పొందాలని సూచించింది.
దరఖాస్తు ఇలా చేయాలి...
పీఎం కిసాన్ లబ్ధిదారులు సీఎస్‌సీ సెంటర్‌కి వెళ్లి పీఎం కిసాన్ కేఎంవై పోర్టల్‌లో దరఖాస్తు చేసుకోవాలి. రైతు మొదట తన ఆధార్ నంబర్, తర్వాత నామినీ వివరాలు రిజిస్టర్ చేయాలి. మాన్‌ధన్ అప్లికేషన్‌ను డౌన్‌లోడ్ చేసుకుని రైతు సంతకం చేసి పోర్టల్‌లో అప్‌లోడ్ చేయాలి. అప్పుడు పీఎం కిసాన్ మాన్‌ధన్ పింఛను కార్డు వస్తుంది.పీఎం కిసాన్ పథకానికి నమోదైన బ్యాంకు అకౌంట్ నుంచి ప్రీమియం నగదును చెల్లించాలి. పీఎం కిసాన్ లబ్ధిదారులు కానట్లయితే సీఎస్‌సీలో దరఖాస్తు చేసుకుని పింఛన్ కార్డును డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.ఇది సన్నకారు రైతులకు వరంగా మారనుంది. అన్నదాతలు అందరూ తప్పకుండా దరఖాస్తు చేసుకుంటే వారికి ఆసరాగా ఉండనుంద.ి