స్కూల్ పిల్లల బ్యాగుల్లో కండోమ్ లు, గర్భనిరోధకమాత్రలు.. నిర్ఘాంతపోయిన టీచర్లు

ఎంతసేపు ఉద్యోగాలు, సంపాదనపైనే దృష్టి పెట్టకుండా..పిల్లలు ఏం చేస్తున్నారో ఓ కంట కనిపెడుతూ ఉండాలని హెచ్చరించాయి.

Update: 2022-12-01 07:05 GMT

condoms in school bags

సాధారణంగా స్కూల్ కి వెళ్లే పిల్లల బ్యాగుల్లో ఏముంటాయి ? పుస్తకాలు, పెన్నులు, పెన్సిళ్లు.. అవి కాకుండా చాక్లెట్లు, బిస్కెట్లు వంటివి ఉంటాయి. ఇది ఒకప్పటి విషయం. కానీ ఇప్పుడు స్కూల్ కి వెళ్లే పిల్లలు ఏం చేస్తున్నారో కనిపెట్టుకుని ఉండటం తల్లిదండ్రుల బాధ్యత. 8,9,10 తరగతులు చదివే పిల్లల బ్యాగుల్లో కండోమ్ లు, సిగరెట్లు, గర్భనిరోధక మాత్రలు, లైటర్లు, వైట్ నర్లుతో పాటు వాటర్ బాటిళ్లలో మద్యం ఉన్నట్లు గుర్తించారు. ఇవన్నీ చూసిన టీచర్లు నిర్ఘాంతపోయారు.

ఈ షాకింగ్ ఘటన కర్ణాటకలోని బెంగళూరులో వెలుగుచూసింది. నగరంలోని పలు పాఠశాలల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. తరగతుల్లోకి విద్యార్థులు మొబైల్స్ తీసుకొస్తున్నారని సమాచారం రావడంతో..విద్యార్థుల బ్యాగులు తనిఖీ చేయాలని స్కూళ్ల యాజమాన్యాలను కర్నాటకలోని ప్రైమరీ, సెకండరీ స్కూల్స్‌ మేనేజ్‌మెంట్‌ అసోసియేషన్‌ (కేఏఎంఎస్‌) ఆదేశించింది. విద్యార్థుల బ్యాగులు తనిఖీ చేసిన టీచర్లకు షాకింగ్ దృశ్యాలు కనిపించాయి. విద్యార్థుల బ్యాగుల్లో కండోమ్ లు, గర్భనిరోధక మాత్రలు, సిగరెట్లు, లైటర్లు, వైట్నర్లు, క్యాష్ చూసి టీచర్లు, అధికారులు షాకయ్యారు. కొంతమంది పిల్లల వాటర్ బాటిల్స్ లో తాగే నీరు కాకుండా మద్యం కూడా ఉన్నట్లు తేలింది. అలెర్టైన స్కూల్ యాజమాన్యాలు విద్యార్థులపై చర్యలు తీసుకోలేదు. వారి తల్లిదండ్రులను పిలిచి కౌన్సిలింగ్ ఇచ్చాయి.
ఎంతసేపు ఉద్యోగాలు, సంపాదనపైనే దృష్టి పెట్టకుండా..పిల్లలు ఏం చేస్తున్నారో ఓ కంట కనిపెడుతూ ఉండాలని హెచ్చరించాయి. ఒక విద్యార్థి బ్యాగ్ లో నోటి ద్వారా తీసుకునే గర్భనిరోధక మాత్రలు (ఐ-పిల్‌) లభించాయని, అలాగే వాటర్‌ బాటిల్‌లో మద్యం దొరికిందని కేఏఎంఎస్‌ ప్రధాన కార్యదర్శి శశికుమార్‌ వెల్లడించారు. వెంటనే తల్లిదండ్రులతో మీటింగ్స్ పెట్టగా.. తమ పిల్లల బ్యాగుల్లో కండోమ్ లు దొరికాయని తెలిసి వారు కూడా నివ్వెరపోయారు. ఇవేవీ తమకు తెలీదన్నారు. కర్ణాటకతో పాటు దేశవ్యాప్తంగా ఈ ఘటన సంచలనమైంది. పిల్లల్లో వచ్చిన ఈ మార్పు భవిష్యత్ కు అంత మంచిది కాదని సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. పిల్లలు ఏం చేస్తున్నారు? ఏం చూస్తున్నారు? అనేదానిపై నిరంతర నిఘా ఉండాలని, ఆ బాధ్యత తల్లిదండ్రులే చూసుకోవాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు.


Tags:    

Similar News