Benaluru : సాయంత్రం అయిదంటే చాలు బెంగళూరువాసుల్లో భయం.. బితుకుబితుకుమంటూనే?

గత మూడు రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు బెంగళూరు నగరం తడిసి ముద్దవుతుంది

Update: 2025-05-19 05:42 GMT

గత మూడు రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు బెంగళూరు నగరం తడిసి ముద్దవుతుంది. లోతట్టు ప్రాంతాలన్నీ మునిగిపోతున్నాయి. చిన్న పాటి వర్షానికే మునిగిపోతుండటంతో కాలనీ వాసులు బయటకు రాలేక ఇబ్బందులు పడుతున్నారు. గ్రీన్ సిటీగా పేరు పొందిన మహానగరం బెంగళూరుకు ఎండల్లో నీటి ఎద్దడి.. వర్షాకాలంలో నీట మునక సర్వసాధారణమయింది. గత కొన్నేళ్లుగా ఇదే పరిస్థితి ఏర్పడింది. కాంక్రీట్ జంగిల్ గా మారిన నగరంలో ఆక్రమణలతో పాటు చెరువులను కూడా ఆక్రమించుకోవడంతో బెంగళూరు నగరం ప్రజలకు నరకం చూపుతుంది. ప్రభుత్వం ప్రతి ఏడాది తీసుకుంటున్న జాగ్రత్తలు నీటిలో కొట్టుకుపోతున్నాయి.

నగరం నరకంగా మారి...
శనివారం నుంచి బెంగళూరులో భారీ వర్షం కురిసింది. బెంగళూరులో కురిసిన వర్షానికి ఐపీఎల్ మ్యాచ్ ను కూడా అంపైర్లు రద్దు చేశారు. వర్షంతో రహదారులు నీటి తటాకాలుగా మారాయి. ఇళ్లలోకి నీరు ప్రవహించడంతో అనేక ప్రాంతాల్లో ప్రజలు రాత్రి వేళ జాగారం చేయాల్సిన పరిస్థితి నెలకొంది. బెంగళూరు నగరంలోని పులికేశినగర, కల్యాణ నగర, ఇందిరా నగర, బాణసవాడి ప్రాంతాల్లో ఈదురుగాలులకు చెట్లు విరిగిపడ్డాయి. అనేక వాహనాలు ధ్వంసమయ్యాయి. బెంగళూరు నగరంలో గంటకు యాభై నుంచి అరవై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు కూడా వీయడంతో పలు చోట్ల హోర్డింగ్ లు కూడా నేలకొరగాయి. దీంతో ప్రభుత్వం ప్రజలను అప్రమత్తం చేసింది.
అనేక కాలనీలు...
వర్షం కురిసినప్పుడల్లా సాయినగర్ లే అవుట్ లోకి వర్షపు నీరు ప్రవేశించడంతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు. ఇక సాఫ్ట్ వేర్ ఉద్యోగులు రెండు రోజుల పాటు సెలవులు రావడంతో కొంత బతికి పోయారు. హెచ్ఎస్బీసీ కూడలితో పాటు జేడీ మార, మాన్యతా టెక్ పార్క్, అడుగోడి, హుళిమావు, ేట్, అనిల్ కుంబ్లే కూడలి, జాలహళ్లి క్రాస్, వసంతనగర, ఐటీపీఎల్ రహదారులన్నీ జలమయం కావడంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. బెంగళూరు నగరంలో గత రెండు రోజుల నుంచి 3.6 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయింది. సాయంత్రం వేళ మాత్రమే వర్షం కురుస్తుండటంతో ఐదు గంటలు అవుతుందంటే బెంగళూరు వాసులు భయపడిపోతున్నారు. మరో వారం రోజులు బెంగళూరుకు వర్షాలు తప్పవని వాతావరణ శాఖ హెచ్చరించడంతో బెంగళూరు వాసులు బితుకుబితుకుమంటూ గడుపుతున్నారు. బెంగళూరుతో పాటు చిక్ మగళూరు, మైసూరులో కూడా వర్షం పడుతుండటంతో అధికారులు ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించారు.
Tags:    

Similar News