America : ట్రంప్ వచ్చాడు.. అమెరికాలో మనోళ్లకు కష్టాలు మొదలు
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అనుకున్నది చేస్తున్నాడు. ట్రంప్ నియంత అన్నది అందరికీ తెలిసిందే.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అనుకున్నది చేస్తున్నాడు. ట్రంప్ నియంత అన్నది అందరికీ తెలిసిందే. అతను చెప్పిన మాట ప్రకారం నిర్దాక్షిణ్యంగా వ్యవహరిస్తుండటంతో భారతీయ విద్యార్థులు ఇబ్బందులు పాలవుతున్నారు. ట్రంప్ తీసుకున్న నిర్ణయంతో అమెరికాలో ఉంటున్న వేలాది మంది భారతీయులు మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. అక్రమంగా అమెరికాలో ఉంటున్న వారిపై ట్రంప్ సర్కార్ ఉక్కుపాదం మోపుతుంది. వెతికి వెంటాడి మరీ విద్యార్థులను ప్రత్యేక విమానాల్లో వెనక్కు పంపుతుంది. అక్రమంగా అమెరికాలో ఉంటున్న వారి కోసం పెద్ద ఆపరేషన్ మొదలు పెట్టారు. ఇందుకోసం ప్రత్యేకంగా ఒక విభాగాన్ని ఏర్పాటు చేశారు. చదువు పేరుతో అక్కడకు వెళ్లి ఉద్యోగం చేసే వారిని పట్టుకుని స్వదేశానికి ఇమిగ్రేషన్ అధికారులు పంపుతున్నారు.
వారం రోజుల నుంచివెళ్లకుండా...
దీంతో భారతీయ విద్యార్థులు గత వారం రోజుల నుంచి పార్ట్ టైం ఉద్యోగాలకు వెళ్లకుండా తమ నివాసాలకే పరిమతమయ్యారు. అమెరికాలోని మిషిగన్ స్టేట్‌లో.. ఓ పెట్రోల్ బంక్‌లో పనిచేస్తున్న ఇద్దరు విద్యార్థులను ఇమ్మిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు పట్టుకున్నారు. ఆ విద్యార్థులు నిబంధనలకు విరుద్ధంగా క్యాంపస్ బయట అనధికారికంగా పనులు చేస్తుండడమే ఇందుకు కారణం. క్యాంపస్ నుంచి వారు ఎక్కడికి వెళ్తున్నారు? ఏం చేస్తున్నారన్న దానిపై మూడు రోజులపాటు నిఘా పెట్టి మరీ పట్టుకున్నారు. అనంతరం విద్యార్థికి అమెరికాలో ఇచ్చే గుర్తింపు సంఖ్యను రద్దు చేశారు. ఆపై ఫిబ్రవరి 15లోగా దేశం విడిచి వెళ్లాలని ఆదేశించారు. దీంతో ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లి.. ఖర్చుల కోసం పార్ట్ టైం జాబ్ చేస్తున్న ఈ విద్యార్థుల పరిస్థితి అగమ్య గోచరంగా తయారైంది. మి
పొట్ట నింపుకోవడం కోసం...
మిషిగన్‌లో మాత్రమే కాకుండా అమెరికా వ్యాప్తంగా ఇలాంటి పరిస్థితులు నెలకొన్నాయి. అక్కడ పార్ట్ టైం ఉద్యోగాలు చేసే విద్యార్థులందరిలోనూ ఆందోళన మొదలైంది. అంతేకాదు. ఇందులో భారతీయులే ఎక్కువ ఉన్నారు. ఎక్కువ మంది ఉన్నత చదువు కోసం అమెరికా వెళ్లి అక్కడ చదువుపూర్తి చేసుకుని ఉద్యోగాల వేటలో ఉన్నారు. ఆలోపు పొట్ట నింపుకోవడం కోసం పార్ట్ టైం జాబ్ చేస్తున్నారు. లక్షల రూపాయలు అప్పులు చేసి మరీ అమెరికా వెళ్లి అక్కడ ఉపాధి దొరకకకపోవడంతో పార్ట్ టైం జాబ్ చేస్తూ జీవనం సాగిస్తున్న వారిపై ట్రంప్ సర్కార్ కొరడా ఝుళిపిస్తుంది. దీని ప్రభావం భారత్ వ్యాపారులపై కూడా పడిందని చెబుతున్నారు. అక్రమ వలసదారులపై కఠినంగా వ్యవహరించాలని ట్రంప్ నిర్ణయించినందునే ఈ పరిస్థితి దాపురించిందని వాపోతున్నారు. ఎక్కువ మంది భారతీయుల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన వారు కూడా అధిక సంఖ్యలో ఉన్నారు. ఇరవై ఐదు వేల మంది వరకూ తెలుగు విద్యార్థులున్నారు.
పార్ట్ టైం ఉద్యోగాలను...
ఉన్నత చదువుల కోసం ఎఫ్-1 వీసాపై అక్కడ ఉంటూ నిబంధనలకు విరుద్ధంగా పార్ట్ టైం ఉద్యోగాలు చేసుకుంటున్నవారు, మాస్టర్స్ పూర్తయి ఓపీటీ సమయంలో ఉన్నవారి పరిస్థితి దిక్కు తోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. విద్యార్థులు ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లి ఫుల్ టైం చదువుల పేరుతో వీసాలు దక్కించుకుని.. విద్యను పక్కనబెట్టి అక్కడ పార్ట్ టైం ఉద్యోగాలు చేస్తున్నారు. ఇలా ఎఫ్-1 వీసాపై వచ్చి పార్ట్ టైం ఉద్యోగం చేయడం కూడా అమెరికా చట్టాల ప్రకారం నేరమే అవుతుందని చెబుతున్నారు. దీంతో తాజాగా ఇలాంటి ఉద్యోగాలపై అక్కడి అధికారులు దృష్టి సారించారు. వీరిని గుర్తించేందుకు అధికారులు తనిఖీలు నిర్వహిస్తారన్న వార్తలతో పార్ట్‌టైం, ఫుల్ టైం ఉద్యోగాలు చేస్తున్న ఎఫ్-1 వీసాదారుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. అక్కడి రెస్టారెంట్లు, సూపర్ మార్కెట్లు, పెట్రోల్ బంకుల్లో పనిచేసే వారిలో ఎక్కువ మంది తెలుగు వారే ఉన్నారు. వారిని వెనక్కు పంపుతుండటంతో తెలుగు వాళ్లలో కలవరం మొదలయింది.