Delhi Blast : ఆపరేషన్ సింధూర్ కు ప్రతీకారంగానే ఈ దాడులా? అనుమానాలివే
ఆపరేషన్ సింధూర్ తర్వాత ఇటువంటి ఉగ్రదాడులు జరుగుతాయని కేంద్ర హోంశాఖ అనుమానించింది
ఆపరేషన్ సింధూర్ తర్వాత ఇటువంటి ఉగ్రదాడులు జరుగుతాయని కేంద్ర హోంశాఖ అనుమానించింది. అందుకే దేశంలో భద్రతను మరింత కట్టుదిట్టం చేసింది. ఆపరేషన్ సింధూర్ కు ప్రతీకారంగా ఏదో ఒక ఘటన జరుగుతుందని సందేహాలు ఎప్పటి నుంచో వినిపిస్తున్నాయి. ఏదో ఒక రూపంలో వచ్చి దాడులు జరుగుతాయని భావించి ఇంటలిజెన్స్ వ్యవస్థ కూడా ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తుంది. అందుకే ఢిల్లీలో అత్యంత రద్దీగా ఉండే ప్రాంతాలను ఎంచుకుని దాడులకు పాల్పడాలని నిర్ణయించుకుని పక్కా ప్రణాళికతో రెక్కీ నిర్వహించి పకడ్బందీగా దాడులకు పాల్పడ్డారు. కారులో పెద్ద యెత్తున పేలుడు పదార్థాలు పెట్టుకుని వచ్చి ముష్కరులు తమను తాము పేల్చుకుని తొమ్మిది మంది మరణానికి కారణమయ్యారు.
అనేక అరెస్ట్ లు చేసి...
ఇటీవల కాలంలో దేశంలో ఐదు రోజుల్లో దేశవ్యాప్తంగా భద్రతా సంస్థలు పలు చోట్ల చేసిన ఆపరేషన్లలో, విపరీతమైన వివరాలు వెలుగుచూశాయి. ఒక డాక్టర్ వద్ద 300 కిలోల ఆర్డీఎక్స్ పట్టుబడింది. మరో డాక్టర్ వద్ద రైసిన్ అనే అత్యంత ప్రాణాంతక విషం దొరికింది. ఇద్దరు డాక్టర్ల వద్ద ఏకే 47 రైఫిళ్ళు స్వాధీనం చేసుకున్నారు. ఒక ఐటీ ఇంజనీర్ వద్ద ఐఈడీ తయారీ మాన్యువల్స్ లభించాయి. ఈ అరెస్టులలో మూడు సంఘటనలు కేవలం గత 24 గంటల్లోనే చోటుచేసుకున్నాయి. ఈ పరిణామాలు దేశ భద్రతకు ముప్పుగా భావించారు. ఇంటలిజెన్స్ నివేదికలను అనుసరించి ముందుగానే అన్ని రకాలుగా చర్యలు తీసుకున్నప్పటికీ ముష్కరులు మరొక రూపంలో మృత్యువు రూపంలో వచ్చినట్లు కనపడుతుంది.
గత కొన్ని రోజులుగా...
జమ్మూ-కశ్మీర్ పోలీసులు, ఉత్తరప్రదేశ్, హర్యానా పోలీసుల సంయుక్త ఆపరేషన్ ఒక అంతర్జాతీయ ఉగ్రవాద కుట్రకు తెరదించగలిగారు. ఈ నెట్‌వర్క్ జైష్-ఎ-మొహమ్మద్ , అన్సర్ గజ్వత్-ఉల్-హింద్ వంటి అంతర్జాతీయ ఉగ్ర సంస్థలతో ముడిపడి ఉందని పోలీసు అధికారులు చెబుతున్నారు. లక్నో నివాసి అయిన మహిళా డాక్టర్ షాహీన్ షాహిద్ ను ఫరీదాబాద్‌లో అరెస్టు చేశారు. ఈ అరెస్టులతో పాటు మొత్తం ఎనిమిది మంది పట్టుబడ్డారు, వీరిలో ముగ్గురు డాక్టర్లు ఉన్నారు. భారీ కుట్ర భారతదేశంలోని వివిధ ప్రాంతాలలో జరుగుతుందని అంచనా వేసి జమ్మూ-కశ్మీర్, హర్యానా, ఉత్తర ప్రదేశ్‌లలో దాడులు నిర్వహించారు. ఈ మాడ్యూల్‌లోని సభ్యులు లక్నోలోని ఆర్ఎస్ఎస్ కార్యాలయం, ఢిల్లీలోని ఆజాద్‌పూర్ మండీ, అహ్మదాబాద్ వంటి ప్రధాన ప్రాంతాల్లో దాడుల కోసం రెక్కీ నిర్వహించినట్లు విచారణ వెల్లడించింది. చివరకు ఎర్రకోట వద్ద బాంబు పేల్చి తొమ్మిది మంది అమాయకుల ప్రాణాలను బలికొన్నారు. దేశం మొత్తం అలెర్ట్ అయింది. నిఘా నీడలోకి వెళ్లిపోయింది.