Delhi Bomb Blast : 32 కార్లతో బాంబు పేలుళ్లు.. దేశంలో భారీ విధ్వంసానికి ప్లాన్

ఢిల్లీ ఎర్రకోటలో కారు బాంబు పేలుడు అనేక విషయాలు వెలుగు చూస్తున్నాయి.

Update: 2025-11-14 02:06 GMT

ఢిల్లీ ఎర్రకోటలో కారు బాంబు పేలుడు అనేక విషయాలు వెలుగు చూస్తున్నాయి. మొత్తం 32 కార్లతో విధ్వంసం జరపాలని కుట్ర జరపినట్లు దర్యాప్తు సంస్థల విచారణలో తేలింది. డిసెంబరు 6వ తేదీన వరస బాంబు బ్లాస్ట్ లతో మారణహోమానికి శ్రీకారం చుట్టాలని ప్లాన్ చేశారు. అయితే ముందుగానే కారు బాంబు పేలడంతో ఈ ప్లాన్ విఫలమయింది. అంతకు ముందే దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఉగ్రవాద మూలాలనున్న వైద్యులను అదుపులోకి తీసుకోవడం ద్వారా కూడా ఈ వ్యూహరచనకు అడ్డుకట్టపడినట్లు తేలింది. ఇంటలిజెన్స్ వర్గాలతో పాటు యాంటీ టెర్రరిస్ట్ స్క్కాడ్ లు పసిగట్టక పోతే మరో నెలలో భారీ విధ్వంసాన్నిచూడా్లసి వచ్చే అవకాశముందని అంచనాలు వినిపిస్తున్నాయి.

అల్ ఫలా వైద్య కళాశాలపై...
మరొక వైపు ఢిల్లీ కారు బాంబు పేలుడు తర్వాత సువిశాలమైన పచ్చని క్యాంపస్‌తో ఒకప్పుడు పేరుపొందిన ఫరీదాబాద్‌లోని అల్‌-ఫలా వైద్య కళశాల ఇప్పుడు దర్యాప్తు సంస్థల నజర్ పడింది. జమ్మూ–కాశ్మీర్‌ పోలీసు, ఎన్‌ఐఏ సంయుక్త బృందం బుధవారం ధౌజ్‌లోని వైద్య కళాశాలను తనిఖీ చేసింది. ఇటీవల ఢిల్లీ ఎర్రకోట వద్ద జరిగిన పేలుడులో పన్నెండు మంది ప్రాణాలు కోల్పోయిన ఘటనకు ఈ కాలేజీ అనుబంధం ఉన్నట్లు దర్యాప్తు అధికారులు అనుమానిస్తున్నారు. 2019 నుంచీ ఉన్న రికార్డులు ఇవ్వాలని అధికారులు ఆదేశించారు. కాలేజీ అధ్యాపకులు, విద్యార్థులను కూడా విచారించేందుకు సిద్ధమయ్యారు. నిందితులుగా గుర్తించిన నలుగురు వైద్యులు డాక్టర్‌ ఉమర్‌ ఉన్‌నబీ, డాక్టర్‌ ముజమ్మిల్‌ షకీల్‌ గనయీ, డాక్టర్‌ షాహీన్‌ షాహిద్‌, డాక్టర్‌ నిసార్‌-ఉల్‌-హసన్‌ ల పై దర్యాప్తు కొనసాగుతోంది. వారి నుంచి వివరాలను సేకరిస్తుంది.
యూనివర్సిటీ రికార్డులను...
వీరిలో డాక్టర్‌ నిసార్‌–ఉల్‌–హసన్‌ను జమ్మూ–కాశ్మీర్‌ ప్రభుత్వం 2022లో ఆర్టికల్‌ 311(2)(C) ప్రకారం సేవల నుంచి తొలగించింది. ఆయన డాక్టర్స్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ కాశ్మీర్‌ అధ్యక్షుడిగా పనిచేస్తూ పాకిస్తాన్‌ మద్దతుతో వేర్పాటువాద భావజాలాన్ని వ్యాప్తి చేస్తున్నారన్న ఆరోపణలు వచ్చాయి. అయితే దర్యాప్తు బృందం ఆయన మరొక గుర్తింపు కార్డుతో అల్‌-ఫలా మెడికల్‌ కాలేజీలో పనిచేసినట్లు గుర్తించింది. ఇది కళాశాల నిర్లక్ష్యమా లేక సహకారమా అన్న అనుమానాలు రేకెత్తుతున్నాయని అధికారుల అభిప్రాయం. ఎర్రకోట పేలుడులో నిసార్‌ కనిపించకపోవడంతో పోలీసులు ఆయనను తీవ్రంగా వెతుకుతున్నారు. అల్‌-ఫలా యూనివర్సిటీ వైస్‌ చాన్సలర్‌ భుపేందర్‌ కౌర్‌ మాట్లాడుతూ తమ సంస్థకు ఉగ్ర మాడ్యూల్‌తో సంబంధం లేదు. దర్యాప్తు సంస్థలకు పూర్తి సహకారం అందిస్తున్నామని తెలిపారు. క్యాంపస్‌లో పేలుడు పదార్థాలు లేదా ఆయుధాలు ఉన్నాయన్న ఆరోపణలను ఆమె ఖండించారు.
న్యాక్ నోటీసులు...
ప్రస్తుతం ఎన్‌ఐఏ బృందం హాజరు రికార్డులు, సిబ్బంది వివరాలు, పాత డేటా తదితర పత్రాలను పరిశీలిస్తోంది. మరొక వైపు అల్ ఫలా యూనివర్సిటీకి న్యాక్ కూడా షోకాజ్ నోటీసులు జారీ చేసింది. ఈ యూనివర్సిటీ నిర్వహిస్తున్న వెబ్ సైట్ లో దాని గుర్తింపు గురించి తప్పుడు సమాచారాన్ని ప్రచురించినందుకు నేషనల్ అస్సెస్ మెంట్ అండ్ అక్రిడేషన్ కౌన్సిల్ ఈ షోకాజ్ నోటీసులు జారీ చేసింది. 76 ఎకరాల్లో విస్తరించి ఉన్న ఈ యూనివర్సిటీని 1997లో ఇంజినీరింగ్ కళశాలగా మొదలై, తర్వాత 2014లో యూనివర్సిటీ హోదా దక్కించుకుంది. 2019లో ఈ యూనివర్సిటీకి అనుబంధంగా అల్ ఫలా మెడికల్ కళాశాల ను ఏర్పాటు చేశారు. ఇప్పుడు దేశవ్యాప్తంగా ఈ యూనివర్సిటీపై అనేక ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. యూనివర్సిటీలో చదువుతున్న వారిపై ఈ కారుబాంబు పేలుడు ప్రభావం పడే అవకాశముంది.


Tags:    

Similar News