సినిమా సహనం నేర్పింది అంటున్న యోగా టీచర్

Update: 2016-10-14 04:21 GMT

మామూలుగా అయితే యోగా అంటేనే.. వ్యక్తిలో సహనం, ఫిట్‌నెస్, ఆరోగ్యం వంటి లక్షణాలను ప్రసాదించేది. అలాంటిది.. నిత్యం యోగా బోధించడం, పలువురికి యోగా శిక్షణ ఇవ్వడం అనేది తన ప్రవృత్తిగా కలిగిన అమ్మాయికి ఈ సహనం లాంటి లక్షణాలు మరెంతో ఎక్కువగా ఉండాలి కదా! ఉండే ఉంటాయి.. కానీ ఆమె మాత్రం.. తాను సినిమా రంగంలోకి వచ్చిన తర్వాతే మరింత సహనంగా ఉండడం నేర్చుకున్నాను.. ఇండస్ట్రీ నాకు సహనం నేర్పింది అని సెలవిస్తోంది. ఇంతకూ ఆ అమ్మాయి మరెవరో కాదు.. విలక్షణమైన పాత్రలతో టాప్ హీరోలతో సమానంగా తనకంటూ ఓ క్రేజ్ సంపాదించుకున్న అనుష్క.

అనుష్క సూపర్ ద్వారా సినిమా పరిశ్రమలోకి ఎంట్రీ ఇవ్వకముందు బెంగుళూరులో యోగా టీచర్‌గా ఉండేదని అందరికీ తెలిసిన సంగతే. అంటే అప్పటికే ఆమెకు ఎంతో సహనం అలవాటై ఉండాలి.

కానీ ఇటీవల ఓ సందర్భంలో మాట్లాడుతూ సినిమా పరిశ్రమ నాకు సహనం చాలా నేర్పింది. నటనా రంగానికి వచ్చిన కొత్తల్లో ఒక్కొక్క షాట్ కోసం కొన్ని గంటల తరబడి వేచిచూస్తూ కూర్చోవాల్సి వచ్చేంది. అంత సహనం నాకు ఎలా అలవాటు అయిందో, నాకు ఇప్పటికీ అర్థం కాదు అని చెప్పుకొచ్చింది అనుష్క. పైగా ఇప్పుడు ప్రతి చెత్త సినిమా కూడా నాకు మాత్రం ఏదో ఒక కోణంలో గొప్పగానే కనిపిస్తుంది. ఎందుకంటే ఆయా సినిమాలు తీయడానికి వాళ్లెంత కష్టపడి ఉంటారో నేను ఊహించగలను అని కూడా చెప్పుకొచ్చింది. చూడబోతే సినిమా ఇండస్ట్రీ అనుష్కకు కేవలం సహనం మాత్రమే కాదు.. పుష్కలంగా పాజిటివ్ యాటిట్యూడ్ కూడా నేర్పినట్లుంది.

Similar News