IBomma : రవిని పట్టుకున్నారు కానీ.. ఫలితం లేదా?
ఐ బొమ్మ ఇమ్మంది రవి విషయంలో పోలీసులు తలలు పట్టుకుంటున్నారు
ఐ బొమ్మ ఇమ్మంది రవి విషయంలో పోలీసులు తలలు పట్టుకుంటున్నారు. విచారణలో రవి ఎలాంటి సమాచారం ఇవ్వకపోవడంతో ఏం చేయాలన్న దానిపై పోలీసులు ఆలోచనలో పడ్డారు. ఈరోజు తో కస్టడీ ముగియనుంది. మరొకవైపు కస్టడీని పొడిగించాలని న్యాయస్థానాన్ని ఆశ్రయించనున్నారు. అయితే నాలుగు రోజుల పోలీసు కస్టడీలో ఐబొమ్మ రవి కనీస సమాచారాన్ని కూడా పోలీసులకు ఇవ్వలేదని సమాచారం. కరేబియన్ దీవుల్లో కార్యాలయం మాత్రం ఉందని చెప్పినా, అందులో ఎవరెవరు పనిచేస్తున్నారన్న దానిపై మాత్రం స్పష్టత ఇవ్వడం లేదు. రవికి ఎక్కడి నుంచి నిధులు వచ్చి పడ్డాయి? ఏ బ్యాంకుల్లో జమ చేశారన్న దానిపై కూడా పొంతన లేని సమాధానం చెబుతున్నాడు.
పూర్తి స్థాయిలో విచారణ...
ఐబొమ్మ రవిని పట్టుకున్నామన్న మాటే కానీ పూర్తి స్థాయిలో విచారణ ముందుకు సాగడం లేదు. రవి ఈ మెయిల్ ద్వారా హైదరాబాద్ కు వచ్చాడని తెలుసుకుని పోలీసులు అరెస్ట్ చేయగలిగారు. అయితే అదే సమయంలో అరెస్ట్ కు ముందు పోలీసులు ఇంటి తలుపులు తట్టడంతో అనుమానించి హార్డ్ డిస్క్, ఫోన్లలో ఉన్న సమాచారాన్ని మొత్తం డిలీట్ చేశారని పోలీసులు అనుమానిస్తున్నారు. దానికి కూడా ఇమ్మంది రవి పొంతన లేని సమాధానాలు ఇస్తుండటంతో ఇప్పుడు విచారణను ఎలా చేయాలన్న దానిపై పోలీసులు మరో మార్గం కోసం వెదుకుతున్నారు. ఐబొమ్మ రవికి సహకరిస్తున్న వారి విషయంలోనూ పోలీసులకు విచారణలో క్లారిటీ రాలేదని తెలిసింది.
నోరు మెదపక పోవడంతో...
రవి తన విచారణలో నోరు మెదపక పోవడంతో పాటు తాను ఏ తప్పు చేయాలేదన్న ధీమాతో ఉన్నారని అంటున్నారు. అందుకే తనకు తెలిసిన సమాచారాన్ని కూడా పోలీసులకు చెప్పడం లేదని తెలిసింది. దీంతో పోలీసులు మరికొన్ని రోజులు రవిని కస్టడీలోకి తీసుకుని లోతుగా విచారించేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. ఈ మేరకు రేపు మరోసారి కస్టడీ పిటీషన్ వేయనున్నారని తెలిసింది. రవి అరెస్ట్ తో పైరసీ సినిమాలు ఆగుతాయని భావించిన పోలీసులకు అవి కూడా ఆగకపోవడంతో పాటు మరికొన్ని సైట్లలో కనపడుతుండటంతో రవి దగ్గర నుంచి కీలక విషయాలను రాబట్టేందుకు పోలీసులు చివర వరకూ ప్రయత్నించాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం.