Akahnda 2 : అఖండ 2 మూవీ విడుదల ఇప్పట్లో లేదటగా?
అఖండ 2 మూవీ ఈ ఏడాది విడుదలయ్యే అవకాశం కనిపించడం లేదు.
అఖండ 2 మూవీ ఈ ఏడాది విడుదలయ్యే అవకాశం కనిపించడం లేదు. ఈ మేరకు బుక్ మై షోలో చేసిన అప్ డేట్ ప్రకారం వచ్చే ఏడాది విడుదలకానున్నట్లు తెలిపింది. నందమూరి బాలకృష్ణ నటించిన అఖండ మూవీ 2 నిన్ననే విడుదల కావాల్సి ఉండగా నిర్మాతలు సాంకేతిక కారణాలు చూపి వాయిదా వేశారు. దీంతో నందమూరి బాలకృష్ణ అభిమానులు నిరాశకు లోనయ్యారు. నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్ లో వస్తున్న ఈ సినిమాపై భారీగా అంచనాలు ఉన్నాయి. సీక్వెల్ కావడంతో సూపర్ డూపర్ హిట్ అవుతుందని బాలయ్య అభిమానులు నమ్మకంతో ఉన్నారు.
సాంకేతిక కారణాలతో...
అయితే ఈ సినిమాలో సాంకేతిక కారణాలతో విడుదలను వాయిదా వేశామని చెబుతున్నారు. ప్రీమియర్ షోలతో పాటు వారం రోజుల పాటు అఖండ 2 మూవీకి సంబంధించిన ధరలు పెంచుకోవచ్చని రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన ప్రభుత్వాలు అనుమతిచ్చాయి. అయినా సాంకేతిక కారణాలను చూపి నిర్మాతలు సినిమాను వాయిదా వేయడంపై నందమూరి బాలకృష్ణ ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముందుగా ప్రకటించినట్లుగా డిసెంబరు 5వ తేదీన విడుదల కావాల్సిన సినిమాను వాయిదా వేయడమేంటని సోషల్ మీడియాలో ప్రశ్నిస్తున్నారు.
విడుదల తేదీని...
అయితే విడుదల తేదీని త్వరలో ప్రకటిస్తామని అఖండ 2 మూవీ నిర్మాతలు ప్రకటించారు. అయితే సినిమా వాయిదా పడటానికి ప్రధాన కారణం మద్రాస్ హైకోర్టు తీర్పు అని చెబుతున్నా. అఖండ 2 మూవీని నిర్మించిన 14 రీల్స్ సంస్థ తమకు 28 కోట్ల రూపాయలు బకాయీ ఉందని, హైకోర్టును ఆశ్రయించగా వివాదం పరిష్కారం అయ్యేంత వరకూ తమిళనాడులో విడుదల చేయవద్దని మద్రాస్ హైకోర్టు తీర్పు చెప్పింది. దీంతో వివాదాన్ని పరిష్కరించాలంటే నిర్మాతలు బకాయీలను తీర్చడంతో పాటు అఖండ మూవీ 2కు ఫైనాన్స్ చేసిన వారి నుంచి కూడా ఇబ్బందులు లేకుండా ఉండేందుకే ఈ మూవీని వాయిదా వేసినట్లు టాలీవుడ్ లో టాక్ నడుస్తుంది. మరి వచ్చే ఏడాది ఎప్పుడన్నది మేకర్స్ ప్రకటించాలి. ఈ నెలలో ఈ మూవీని విడుదల చేయాలని బాలయ్య అభిమానులు కోరుతున్నారు.