సింగం వాయిదాపై కస్సుబుస్సు మంటున్న హరి!

Update: 2016-12-03 06:49 GMT

ఇంతకూ సింగం 3 సినిమా వాయిదా పడడం వెనుక అసలు కారణాలు ఏంటి? సినిమా పోస్ట్ ప్రొడక్షన్ లోనే జాప్యం ఉన్నదా లేదా.. ఇండస్ట్రీలో ఇప్పటికే బీభత్సంగా వ్యాపిస్తున్న పుకార్ల ప్రకారం.. రాంచరణ్ హీరోగా నటిస్తున్న ధ్రువ చిత్రానికి థియేటర్లలో కనీసం రెండు వారాల రన్నింగ్ పీరియడ్ ఉండేలా.. కాస్త వెసులుబాటు ఇవ్వడానికి ఈ తమిళ నిర్మాతలు త్యాగం చేశారా? అనేది సందేహాలుగా వినిపిస్తున్నాయి.

ధ్రువ చిత్ర నిర్మాత అల్లు అరవింద్ కు , తమిళ సింగం 3 నిర్మాత జ్ఞానవేల్ రాజాకు సత్సంబంధాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే అరవింద్ మేనేజ్ చేయగలిగారని ఒక పుకారు వినిపిస్తోంది. అయితే ధ్రువ విజయదశమి నుంచి డిసెంబరు 2 కు తర్వాత 9వ తేదీకి వాయిదాల మీద వాయిదాలు పడుతూ వచ్చినట్లే.. సింగం 3 కూడా అచ్చంగా అలాగే జరుగుతూ వచ్చింది. తొలుత ఈ చిత్రాన్ని దీపావళికి విడుదల చేస్తాం అన్నారు. ఆ తర్వాత డిసెంబరు 16న వస్తున్నట్లు హీరో సూర్య ప్రకటించారు. తాజాగా మరో వారం వాయిదాను వెల్లడించారు.

నిజానికి ఈ తాజా వాయిదా మీద దర్శకుడు హరి మాత్రం గుర్రు మంటున్నాడని కోలీవుడ్ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. సినిమా వర్క్ మొత్తం పూర్తయిపోయిందని.. అనవసరంగా విడుదల వాయిదా వేసుకోవడం మార్కెట్ ను దెబ్బతీసుకోవడమేనని.. హరి భావిస్తున్నారట. అదికూడా ఏదో తెలుగు చిత్రానికి ఫేవర్ చేయడానికి దీనిని వాయిదా వేస్తున్నట్లుగా జరుగుతున్న ప్రచారం దర్శకుడు హరికి అసహనం కలిగిస్తోందిట. ఇంతవరకూ వచ్చి విడుదల వెనక్కి వెళ్లడం అంటే.. కలెక్షన్ల విషయంలో తాము భయపడినట్లుగా ఉంటుందని.. ఇది మంచి సంకేతం కాదని ఆయన భావిస్తున్నారట. మరి ఈ రెండో పోలీసు చిత్రాల్లో బాక్సాఫీసు వద్ద ఏది ఢంకా బజాయిస్తుందో చూడాలి.

Similar News