నలుపు తెలుపు చిత్రాల కాలంలో శోభన్ బాబు నటించిన సోగ్గాడు చిత్రం మహా పెద్ద సంచలనం. ఆ రోజుల్లో దగ్గుబాటి రామానాయుడు సురేష్ ప్రొడక్షన్స్ సంస్థలో నిర్మించారు. 2005 లో అదే సంస్థలో దగ్గుబాటి సురేష్ బాబు తరుణ్, ఆర్తి అగర్వాల్ నటీనటులుగా రవి బాబు దర్శకత్వంలో సోగ్గాడు అనే టైటిల్ తో చిత్రాన్ని నిర్మించి ఎదురు దెబ్బ తిన్నారు. కాని ఆ టైటిల్ పై ఇంకా మన వాళ్లకు మోజు పోలేదు. దర్శకుడిగా జ్యో అచ్చుతానంద చిత్రంతో విజయ పతాకం ఎగుర వేసిన అవసరాల శ్రీనివాస్ కథానాయకుడిగా ప్రముఖ చిత్ర పంపిణీ సంస్థ ఐన అభిషేక్ పిక్చర్స్ ఒక చిత్రాన్ని నిర్మిస్తుంది.
బాలీవుడ్ లో వినూత్న కథాంశంతో తెరకెక్కి ఒక వర్గ ప్రేక్షకులకు బాగా చేరువ ఐన చిత్రం హంటర్. ఆ కథను తెలుగులో అన్ని వర్గాల ప్రేక్షకులకు చేరువ చేసే విధంగా కథనం లో శ్రద్ద తీసుకుంటున్నారంట నిర్మాతలైన అభిషేక్ పిక్చర్స్ వారు. నటుడిగా కూడా అవసరాల శ్రీనివాస్కు గుర్తింపు ఉంది. అయితే ఈ చిత్రంతో కామెడీ చేయగల అవసరాల శ్రీనివాస్ ను ఇండిపెండెంట్ కామెడీ హీరో గా నిలబెట్టే సరైన ప్రయత్నం ఇది అని బలంగా నమ్ముతుంది అభిషేక్ పిక్చర్స్ యాజమాన్యం. హంటర్ చిత్ర తెలుగు రీమేక్ కి కూడా సోగ్గాడు అనే పేరును ఖరారు చేయనున్నారు.
ఈ హిందీ రీమేక్ చిత్రంలో అవసరాల శ్రీనివాస్ సరసన మిష్టి చక్రవర్తి, శ్రీ ముఖి నటించనున్నారు.