విడుదల వాయిదాలు తప్పనిసరి అవుతున్నాయి

Update: 2016-11-12 06:17 GMT

పెద్ద నిర్మాణ సంస్థల నుంచి చిన్న చిత్రాల నిర్మాతల వరకు దాదాపుగా అందరూ చిత్ర నిర్మాణానికి అయ్యే వ్యయంలో కనీసం కొంత మొత్తం అయినా ఫైనాన్సియర్ల దగ్గర నుంచి అప్పుగా తెచ్చి మిగతా మొత్తం వారి సొమ్ము వెచ్చించి చిత్ర నిర్మాణాలు చేపడుతుంటారు. మరి కొందరు నిర్మాతలు పూర్తిగా ఫైనాన్సియర్ల నుంచి అప్పుగా తీసుకుని సొమ్ముతోనే చిత్రాలు నిర్మిస్తున్నారు. విడుదలకి ముందుగా పంపిణీదారులు నుంచి పొందే ప్రాంతాల వారి విడుదల హక్కుల తాలూకా మొత్తాన్ని ఫైనాన్సియర్లకు కట్టి విడుదలకు ఆర్ధిక అడ్డంకులు లేకుండా జాగ్రత్త పడుతుంటారు.

అయితే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం అమలులోకి తీసుకువచ్చిన పెద్ద నోట్ల రద్దు వలన ఆర్ధిక లావా దేవీలు పూర్వంలా సులభ తరహాలో చేతులు మారటం సాధ్యం కాని పరిస్థితి ఏర్పడింది. దీనితో పంపిణీదారులు నిర్మాతకు సమయానికి చెల్లించలేక, నిర్మాత ఫైనాన్సియర్ల నుంచి విడుదలకు అనుమతి తెచ్చుకోలేక అవస్థలు పడుతున్నారు. ఈ కారణాన ముందుగా ప్రకటించిన విడుదల తేదీలకు విడుదల కాలేని చిత్రాలు కొన్ని వాయిదాలు పడుతున్నాయి. మరి కొన్ని చిత్రాలకు ఈ ఆర్ధిక సర్దుబాట్ల ఇబ్బందులు లేనప్పటికీ ప్రజల దగ్గర చలామణిలోకి రాని కొత్త నోట్లు నిర్మాతల ప్రణాళికలను మారుస్తున్నాయి.

ఇంట్లో దెయ్యం నాకేంటి భయం వంటి చిత్రాలు ఇలా వాయిదా పడినవే. ఈ పరిస్థితి చక్కబడటానికి ఎంత కాలం పడుతుందో సినీ నిపుణులు అంచనాకు రాలేకపోతున్నారు.

Similar News