వర్మకు మొట్టికాయ్ : కులం పాట కు కోత పెట్టారు

Update: 2016-12-02 22:29 GMT

తాను తీసే సినిమాల పబ్లిసిటీ కోసం నయాపైసా ఖర్చు పెట్టకుండా.. రిలీజ్ అయ్యేందుకు సరిపడా పబ్లిసిటీ మొత్తం వాటి చుట్టూ తాను సృష్టించే వివాదాల ద్వారా మాత్రమే రాబట్టాలని వ్యూహాత్మకంగా వ్యవహరించే తెలివైన దర్శకుడు రాంగోపాల్ వర్మ. అదే సిద్ధాంతం ఫాలో అవుతూ ఆయన తాజాగా రూపొందిస్తున్న సినిమా ‘వంగవీటి’. విజయవాడలో ఒకప్పటి రాజకీయ నాయకుడు, హత్యకు గురైన నేత వంగవీటి రంగా జీవిత కథాంశంతో ఈ సినిమా చేస్తున్నట్లు వర్మ చెబుతున్నారు. ఈ చిత్రం వాస్తవాలకు విరుద్ధంగా తీశారంటూ రంగా కొడుకు వంగవీటి రాధా కోర్టులో కేసు వేసిన సంగతి కూడా తెలిసిందే.

అయితే తాజాగా హైకోర్టు ఈ చిత్రం రూపకర్తలు అనగా దర్శకుడు వర్మ, నిర్మాత దాసరి కిరణ్ కుమార్ లకు ఓ మొట్టికాయ్ వేసింది. ఓ పిటిషన్ ను విచారిస్తూ.. సినిమాలో కులాల పేర్లతో వివాదస్పదంగా ఉన్న ఒక పాటను తొలగించాల్సిందిగా ఆదేశించింది. దానికి నిర్మాతలు కూడా ఒప్పుకున్నారు.

ఈ చిత్రంలో కమ్మ, కాపు అనే పదాలు వాడుతూ ఆ కులాల మధ్య కక్షలను ఎస్టాబ్లిష్ చేస్తూ ఓ పాట రాయించారు.

నిజానికి ఈ చిత్రం ఆడియో శనివారం నాడు విజయవాడలో జరగాల్సి ఉంది. కానీ రాంగోపాల్ వర్మ.. చాలా తెలివిగా వివాదాస్పదమైన, కులాల ప్రస్తావన ఉన్న ఆ పాటను మాత్రం చాలా కాలం కిందటే యూట్యూబ్ లో విడుదల చేశారు. అయితే ఇందులో ఉన్న కులాల గొడవ గురించి హైకోర్టులో పిటిషన్ దాఖలవడంతో కోర్టు వారికి అక్షింతలు వేసింది.

ఆడియో విడుదలకు ఒక రోజు ముందే ఆ పాటను తొలగించడానికి నిర్మాత, దర్శకులు ఒప్పుకున్నారు. ’ నా సినిమా నా ఇష్టం. నాఇష్టం వచ్చినట్లు తీస్తా..’ అనే వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచే వర్మ, న్యాయస్థానం ముందు మాత్రం తల వంచడం విశేషం.

Similar News