రెండు వారాలు డబల్ షిఫ్ట్ లు కష్టపడ్డ బాలయ్య

Update: 2016-12-02 20:03 GMT

సూపర్ స్టార్ కృష్ణ యుక్త వయసులో దాదాపు ఒక దశాబ్ద కాలం పాటు ఉదయం 7 గంటల నుంచి తెల్లవారు జామున మూడు గంటల వరకు వివిధ షిఫ్టులుగా పలు నిర్మాతలకు ఏక కాలంలో సినిమాలు చేసి నిర్మాతల శ్రేయస్సు కోరుకునే కథానాయకుడుగా చిరకాలం చెరగని కీర్తి సంపాదించుకున్నారు. ఇప్పటి యువ నటులు ఇంతటి కష్టం తీసుకోనప్పటికీ సీనియర్ కథానాయకుడు నందమూరి బాల కృష్ణ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న చారిత్రాత్మక కథ గౌతమీ పుత్ర శాతకర్ణి కోసం ఇటువంటి క్లిష్ట పరిస్థితినే ఎదుర్కొన్నారు. ముందుగా ప్రకటించిన విధంగా సంక్రాంతి విడుదలకు సిద్ధం చేయటానికి బాలయ్య నిర్మాతలకు సహకరించిన తీరును నిర్మాత రాజీవ్ రెడ్డి మీడియా మిత్రులతో పంచుకున్నారు.

"సాధారణంగా సీనియర్ హీరోలతో చిత్రీకరణ అంటే మేము ఎంతో కొంత షెడ్యూల్ ప్రణాళికలో రాజీపడవలసి ఉంటుంది. కానీ నందమూరి బాల కృష్ణ తో గౌతమీ పుత్ర శాతకర్ణి వంటి భారీ ప్రాజెక్ట్ కు మాకు అటువంటి ఇబ్బందులు ఏవీ ఎదురు కాకుండా సహకరించారు బాలయ్య. చిత్రీకరణ తుది దశకు చేరే సరికి ప్రణాళిక ప్రకారం పూర్తి కాకపోవటంతో నిర్మాణాంతర కార్యక్రమాలు ఆలస్యం జరిగి ప్రకటించిన విడుదల తేదికి ప్రేక్షకుల ముందుకు చిత్రం తీసుకురావటంలో జాప్యం జరగటం ఖాయం అని మేము భయపడుతుండగా బాలయ్య బాబు స్వయంగా ఆయనే డబల్ షిఫ్ట్ పని చేయటానికి ఒప్పుకుని చివరి రెండు వారాల చిత్రీకరణ రోజుకి 16 గంటలు పని చేసి షెడ్యూల్ కన్నా ఒక్క రోజు ముందుగా చిత్రీకరణను పూర్తి చేయటానికి మాకు తోడ్పడ్డారు." అని తన ఆనందాన్ని వ్యక్తం చేశారు రాజీవ్ రెడ్డి.

Similar News