వాణిజ్య అంశాలతో కూడుకున్న చిత్రాలు చూసే సామాన్య ప్రేక్షకుడి మేధా శక్తికి అందని కథనాలతో తన చిత్రాలను తెరకెక్కిస్తుంటారు దర్శకుడు గౌతమ్ వాసుదేవ్ మీనన్. ఆయన ఎన్నో ఆణిముత్యాలు తీసిన వాటిల్లో చాలా వరకు ప్రేక్షకాదరణ పొందలేకపోయాయి. సూర్య సొన్ ఆఫ్ కృష్ణన్, రాఘవన్, ఎటో వెళ్లిపోయింది మనసు లాంటి చిత్రాలు ఇందుకు ఉదాహరణ. అయితే ఈ చిత్రాలన్నిటికి ప్రత్యేకమైన ప్రేక్షకులు ఉండటం విశేషం. వారంతా గౌతమ్ మీనన్ చిత్రాలు ఎప్పుడు వస్తాయా అని ఎదురు చూస్తుంటారు కూడా.
తాజాగా విడుదల ఐన సాహసం శ్వాసగా సాగిపో ఈ కోవకు చెందిందే. ప్రథమార్ధంలో సాగే ప్రేమ కథ ద్వితీయార్ధంలో వేరే పంథాలో సాగిపోతుంది. కానీ మొదటి ఫ్రేమ్ నుంచి ఆఖరి ఫ్రేమ్ వరకు ఎక్కడా ప్రేక్షకుడు కథ నుంచి బైటకి రాడు. కథనంలో పాటల ప్లేసెమెంట్ విషయంలో గౌతమ్ మీనన్ చేసిన వినూత్న ప్రయత్నాన్ని కొందరు స్వాగతిస్తే మరి కొందరు పెదవి విరిచారు. పతాక సన్నివేశాలు కూడా కొందరు మెచ్చుకుంటే మరి కొందరు విమర్శిస్తున్నారు. ఈ నేపథ్యంలో చిత్ర పతాక సన్నివేశాల కథనం గురించి గౌతమ్ మీనన్ స్పందించారు.
"అది ఒక నిజ జీవిత ఘటన. నాకు తెలిసి వున్నా వారు ఒకరు నిజ జీవితంలో మూడు సంవత్సరాల వ్యవధిలో వ్యక్తిగత కక్ష సాధనకై పోలీస్ ఆఫీసర్ అయ్యారు. నేను దానినే తెరపై చూపించాలి అనుకుని ఎటువంటి సినిమాటిక్ మార్పులు చెయ్యలేదు. అయితే ఇది ఎంత మందికి నచ్చింది? ఎంత మందికి నచ్చలేదు? అనే రిజల్ట్ గురించి నేను పట్టించుకోను. నా చిత్రం గురించి అందరూ చర్చించుకోవాలి అని తాపత్రయం. ఇప్పుడు అది జరుగుతుంది. ఇదే నా సక్సెస్." అని పేర్కొన్నారు గౌతమ్ వాసుదేవ్ మీనన్.