బాణం చిత్రం నుంచి తన నట జీవితంలో అనేక వైవిధ్యాలను కోరుకుంటూ ప్రయాణం చేస్తున్న నారా రోహిత్, ఒడి దుడుకులు ఎదుర్కొంటు కెరీర్ నెట్టుకొస్తున్న సమయంలో అవసరాల శ్రీనివాస్ దర్శకత్వంలో వచ్చిన జ్యో అచ్చుతానంద విజయం ఊపిరి పోసింది. కుటుంబ ప్రేక్షకులు ఆ చిత్రం పై బాగా ఆసక్తి చూపటంతో ప్రతి పంపిణీదారుడు లాభాల బాట పట్టారు. నారా రోహిత్ గత చిత్రాలలో కొన్ని కేవలం ఒక వర్గ ప్రేక్షకులకే పరిమితం అవటం వలన అతని ఖాతాలో సోలో మినహా మరే చిత్రం పూర్తి స్థాయి కమర్షియల్ సక్సెస్ గా చేరలేకపోయాయి.
చాలా సంవత్సరాల నుంచి చిత్రీకరణ పూర్తి చేసుకుని విడుదలకు నోచుకోని చిత్రంగా శంకర మిగిలిపోయింది. నారా రోహిత్, రెజినా నాయకానాయికలు గా నటించారు. ఇటీవల విడుదలై విజయం పొందిన జ్యో అచ్చుతానంద లో కూడా రెజినా ఒక ముఖ్య భూమిక పోషించింది. దీనినే అదనుగా చేసుకుని ప్రచారం చేసి శంకర చిత్రం విడుదల కు ఈ శుక్రవారం ముహూర్తం పెట్టారు. ఇలా చిత్రీకరణ జరుపుకుని విడుదల ఆలస్యం ఐన అనేక చిత్రాలు పరాజయం పొందటం మనం చూస్తూనే వున్నాం.
జ్యో అచ్చుతానంద విజయాన్ని ప్రచారంగా వాడుకుని విడుదల చేస్తున్న శంకర నారా రోహిత్ కి మళ్లీ చేదు అనుభవాలు మిగులుస్తుందో లేక విజయం సాధించి రోహిత్ ని ఆదుకుంటుందో చూడాలి. సినీ పండితులు మాత్రం శంకర విడుదల నిర్మాతకి లాభదాయకం అవ్వొచ్చు కానీ హీరో కి ఇబ్బందికరమే అని అభిప్రాయం పడుతున్నారు.