రవితేజ, నాగార్జున వద్దన్నాక నానితోనా?

Update: 2016-10-30 08:37 GMT

టాలీవుడ్‌లో నిర్మాత, డిస్ట్రిబ్యూటర్‌ దిల్‌రాజుకు మంచి డిస్ట్రిబ్యూటర్‌గానే కాదు మంచి నిర్మాతగా కూడా ఎంతో పేరుంది. టాలెంట్‌ ఉండే దర్శకులను, వారి దగ్గర ఉన్న స్టోరీలు ఒక్కసారి ఆయనకు నచ్చాయంటే వారికి హిట్‌ ఇచ్చేదాకా దర్శకత్వ అవకాశాలు ఇస్తాడనే గొప్ప పేరు ఆయనకుంది. కాగా ఎప్పుడో 'ఓ మై ఫ్రెండ్‌' వంటి ఫ్లాప్‌ చిత్రం తీసిన దర్శకుడు వేణుశ్రీరాం ప్రతిభ అంటే దిల్‌రాజుకు చాలా నమ్మకం వుంది. ఒకే ఒక్క డిజాస్టర్‌ ద్వారా ఎవరి ప్రతిభను తక్కువ అంచనా వేయలేమని భావించే దిల్‌రాజుకు వేణుశ్రీరాం తయారు చేసిన కథ ఒకటి బాగా నచ్చింది. నచ్చిందే తడవుగా 'ఎవడో ఒకడు' అనే టైటిల్‌తో వేణుశ్రీరాం దర్శకత్వంలో రవితేజ హీరోగా ఈ చిత్రాన్ని నిర్మించాలని భావించాడు.

సెట్స్‌ దాకా వెళ్లాల్సిన ఈ చిత్రానికి రవితేజ చివరి క్షణంలో నో చెప్పాడు. దీనికి రెమ్యూనరేషన్‌ ఇబ్బంది అని కొందరు, కాదు... కాదు.. సెకండాఫ్‌ రవితేజకు నచ్చలేదని కొందరు అంటున్నారని వార్తలు వచ్చాయి. ఆ తర్వాత ఇదే సబ్జెక్ట్‌ను నాగార్జునకు వినిపిస్తే ఆయనకు కూడా స్టోరీ బాగా నచ్చి ఈ చిత్రం చేస్తానని హామీ ఇచ్చాడట. కానీ చివరి క్షణంలో నాగ్‌ కూడా వెనకడుగు వేశాడని విశ్వసనీయ సమాచారం. తాజాగా ఇదే కథను దిల్‌రాజ్‌ వేణుశ్రీరాం చేత నానికి చెప్పించి గ్రీన్‌సిగ్నల్‌ పొందాడని సమాచారం. ప్రస్తుతం దిల్‌రాజు బేనర్‌లో నాని 'నేను.. లోకల్‌' చిత్రం చేస్తున్నాడు. ఈ చిత్రం తర్వాత నానికి బయటి నిర్మాతలతో మూడు నాలుగు కమిట్‌మెంట్స్‌ ఉన్నాయి. అవి పూర్తయ్యే వరకు దిల్‌ రాజు నాని కోసం ఆగుతాడా? లేక వేరే హీరోతో వేణుశ్రీరామ్‌తో ముందుకు వెళ్తాడా? అనేది వేచిచూడాల్సిన విషయం.

Similar News