దివంగత దర్శక దిగ్గజం ఈ.వి.వి.సత్యనారాయణ తనయుడు అల్లరి నరేష్ అతి తక్కువ కాలంలో 50 చిత్రాలు పూర్తి చేసిన నేటి తరం నటులలో ఒకే ఒక్క నటుడిగా నిలిచారు. నిత్యం విజయ బాటనే పయనించిన అల్లరి నరేష్ కు ఇటీవలి కాలంలో అడపా దడపా కూడా విజయం పలకరించడం లేదు. ప్రతి సారి ఈ చిత్రం అంచనాలను అందుకుంటుంది అని చెప్పటం అది విడుదల తరువాత నిరాశ పరచటం షరా మామూలు అయిపోయింది. ఇక ఇప్పుడు అయితే అల్లరి నరేష్ చిత్రాలపై అంచనాలు పెట్టుకునే ప్రేక్షకులు కూడా కరువైపోయారు.
ఈ వైఫల్యాలతో విసిగిపోయినట్టున్నాడు అల్లరి నరేష్. త్వరలో నటన నుంచి కొంతకాలం బ్రేక్ తీసుకుని దర్శకత్వం పై శ్రద్ధ పెడతానని వెల్లడించాడు. తనకు తన తండ్రే ఈ విషయంలో స్ఫూర్తి అని, ఎప్పటికైనా దర్శకత్వం వహించి తీరుతాను అని ఎప్పుడూ చెప్పే నరేష్ ఈ సారి మాత్రం దర్శకత్వం పై కొంచం కచ్చితంగానే వున్నాడు. అయితే తాను ఫుల్ టైం డైరెక్టర్ కాబోనని కేవలం రెండు లేదా మూడు చిత్రాలకు మాత్రమే దర్శకత్వం వహిస్తానని స్పష్టం చేసాడు. అదే సమయంలో తన దర్శకత్వంలో నటించబోనని అల్లరి నరేష్ బల్ల గుద్ది చెప్తున్నాడు.