పాత తరం కథానాయికల లాగా నేటి తరం హీరోయిన్స్ సినిమా పరిశ్రమలో కేవలం నటనకు పరిమితం కావట్లేదు. సావిత్రి, విజయ నిర్మల వంటి అతి తక్కువ మంది నటనను దాటుకుని మరికొన్ని విభాగాలలో ప్రతిభ కనపరిచారు. నేటి తరం ఇందుకు పూర్తిగా విభిన్నం. నటిగా నాలుగైదు చిత్రాలు పూర్తి అవుతూనే క్రేజీ ప్రాజెక్ట్స్ కి సమర్పకురాలిగానో, నిర్మాణ బాగస్వామిగానో ఎదగటానికి తహతహలాడుతున్నారు. బాలీవుడ్ లో అయితే ఈ పరిస్థితి మరీ ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. అనుష్క శర్మ, ప్రియాంక చోప్రా వంటి లైం లైట్ లో వున్న వారంతా నిర్మాణ రంగంలోనూ అడుగు పెట్టారు.
బాలీవుడ్ లో అడుగుపెడుతూనే సంచలనాలు సృష్టించిన హాట్ యాక్ట్రెస్ సన్నీ లియోన్ ఇప్పుడు దర్శక నిర్మాణం వైపు అడుగులు వేస్తుంది. ఈ విషయాన్ని సన్నీ స్వయంగా ప్రకటించింది. "బాలీవుడ్ లో నా నట జీవితం ప్రారంభం ఐన నాటి నుంచే నేను సినిమాకి సంబంధించిన వివిధ విభాగాలపై పట్టు సాధించే విధంగా ప్రయత్నాలు చేస్తున్నాను. ఈ క్రమంలో ఫిలిం మేకింగ్ లో ఎన్నో మెళకువలు నేర్చుకున్నప్పటికీ బాలీవుడ్ కి వుండే విస్తృత మార్కెట్ దృష్టిలో ఉంచుకుని హిందీ చిత్రం దర్శకత్వం వహించటానికి ఈ అనుభవం సరిపోదు. ఇతర నిర్మాతలు నా అనుభవ రాహిత్యం వలన నష్ట పోకుండా నా దర్శాకత్వంలో రానున్న తొలి చిత్రాన్ని నేనే నిర్మిస్తాను. రొమాంటిక్ కామెడీ నేపథ్యంలో సాగే కథతో దర్శకురాలిగా నా పరిచయ చిత్రం ఉండబోతుంది." అని తన తొలి చిత్ర వివరాలు వెల్లడించింది సన్నీ లియోన్.