ఈ ఏడాది సరైనోడుతో బిగ్గెస్ట్ మ్యూజికల్ హిట్ అందుకుని ఆ చిత్ర భారీ విజయంలోనూ తన నేపధ్య సంగీతం కీలక పాత్ర పోషించేలా జాగ్రత్తలు వహించిన ఎస్.ఎస్.థమన్ తరువాత చిన్న చిత్రాలకు సంగీతం అందించే పనిలో నిమగ్నమై పెద్ద చిత్రాలు ఏవీ అంగీకరించలేదు. దానితో హిప్ హాప్, జిబ్రాన్, అనిరుద్ లు తెలుగు చిత్ర పరిశ్రమలోకి దూసుకు వస్తున్నారు. ఇక థమన్ కి అవకాశాల కొరత మొదలు ఐయ్యింది అనే అందరూ భావించారు. దీనికి సమాధానంగా ఆయన తాజాగా ఒకే రోజు ప్రకటించిన ఇద్దరు స్టార్ హీరోస్ సినిమాలతో పాటు ఒక హీరోయిన్ ఓరియెంటెడ్ చిత్రం థమన్ ఇంకా ఫామ్లోనే వున్నాడు అని నిరూపించాయి.
రానున్న మహేష్ బాబు సినిమాల్లో ఒక చిత్రానికి ఎస్.ఎస్.థమన్ సంగీత దర్శకత్వ బాధ్యతలు స్వీకరించాడు. దూకుడు, బిజినెస్ మాన్, ఆగడు తరువాత మహేష్ బాబు కి థమన్ సంగీతం అందిస్తున్న నాలుగవ చిత్రమిది. ఈ చిత్రంతో పాటు అక్కినేని నాగార్జున నటిస్తున్న రాజు గారి గది 2 చిత్రానికి థమన్ స్వరాలూ సమకూర్చనున్నాడు. ఇప్పటికే అనుష్క ప్రధాన పాత్రలో నటిస్తున్న హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమా భాగమతి కి థమన్ పేరు ఇప్పటికే ఖరారు అయ్యింది.
సరైనోడు తరువాత ఈ ఏడాది పెద్ద హీరోల చిత్రాలు చేయనప్పటికీ థమన్ శ్రీరస్తు శుభమస్తు, చుట్టాలబ్బాయి, తిక్క చిత్రాలకు సంగీతాన్ని సమకూర్చి శ్రీరస్తు శుభమస్తు సంగీతానికి గాను సంగీత ప్రియుల ప్రశంసలు పొందాడు.