దర్శకేంద్రుడు కే.రాఘవేంద్ర రావు గారి దర్శక బృందంలో చేరి ఆయన దగ్గర శిష్యరికం చేస్తుండగా ఆన్ స్క్రీన్ అవకాశాలు రావటంతో హీరో అయ్యాడు నాచురల్ స్టార్ నాని. కానీ ఎప్పటికైనా తన దర్శకత్వ ప్రతిభ ప్రదర్శించి ప్రేక్షకుల మెప్పు పొందుతానని కానేక సందర్భాలలో చెప్పాడు ఈ యువ హీరో. కానీ తనకు సొంతగా నిర్మాణ సంస్థ ఏర్పరిచి తన అభిరుచి కి తగ్గ కథలు తానే స్వయంగా నిర్మించాలని వుంది అనే ఆలోచనను ఎప్పుడు పంచుకోలేదు. అకస్మాత్తుగా ఇప్పుడు తన బంధువులతో కలిసి నిర్మాణ సంస్థ స్థాపించబోతున్నాడు.
గతంలో తన సమకాలీన నటులతో కలిసి చిన్న పాటి పెట్టుబడి పెట్టి డి ఫర్ దోపిడీ చిత్రానికి నిర్మాణ భాగస్వామిగా వ్యవహరించాడు నాని. ఇప్పుడు పూర్తి స్థాయి నిర్మాతగా మారబోతున్నాడు. ఈ తరంలో వాణిజ్య చిత్రాలలో సైతం తన శైలి లో కొత్తతనం నిండిన కథలను ఎంపిక చేసుకునే నాని నిర్మాతగా మారితే మంచి చిత్రాలు తరచుగా రావటం ఖాయం అని నాని కి అతి సన్నిహితంగా వుండే యువ హీరోలు కొందరు హర్షిస్తున్నారు. నాని నిర్మాణంలో రాబోయే మొదటి చిత్రానికి దర్శకుడు అవసరాల శ్రీనివాస్ అని తెలుస్తుంది.
మరి నాని తన చిత్రాలనే తాను నిర్మించుకుంటాడో లేక కొత్త దర్శకులకు నటులకు అవకాశం ఇస్తారో చూడాలి. ప్రస్తుతం నాని నేను లోకల్ అనే చిత్రం లో నటిస్తున్నాడు.