మణి చిత్రానికి నామకరణం పనిలో దిల్ రాజు

Update: 2016-11-12 14:34 GMT

భాష బేధం లేకుండా సినిమా అభిమానులు అందరూ దాదాపుగా దర్శకుడు మణి రత్నం కి అభిమానులే అనటంలో అతిశయోక్తి లేదు. ఆయన నుంచి వచ్చిన ఆణిముత్యాలు అటువంటివి. మౌన రాగం, ఘర్షణ, నాయకుడు, దళపతి, గీతాంజలి, అంజలి, రోజా, బొంబాయి, ఇద్దరు, అమృత, సఖి, యువ ఇలా ఈ జాబితా పెద్దదే. వీటిల్లో కొన్ని వసూళ్ల పరంగానూ విజయ శిఖరాలు అందుకోగా, అన్ని చిత్రాలు విశ్లేషకులు, విమర్శకుల నుంచి ప్రశంసలు పొందినవే. మధ్యలో గురు, రావణ్, కడలి వంటి చిత్రాలు వరుసగా వసూళ్ల పరంగా నిరాశ పరచగా గత ఏడాది ఓ కాదల్ కన్మణి(తెలుగు లో ఓకే బంగారం) చిత్రం తో మళ్లీ ఫామ్ లోకి వచ్చారు మణి రత్నం.

ఓకే బంగారం తరువాత ఆయన నుంచి వస్తున్న చిత్రం కాట్రు వెళాయిదై. కార్తీ అదితి రావు హైదరి జంటగా నటిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన తమిళ పోస్టర్ ను ఇటీవల విడుదల చేసారు. కార్తీ ఆ పోస్టర్లో నున్నటి షేవ్ తో లవర్ బాయ్ లా దర్శనమిచ్చి ఆకట్టుకున్నాడు. ఈ పోస్టర్తో పాటు చిత్రీకరణ వివరాలను వెల్లడించింది చిత్ర బృందం. ఈ చిత్రం చిత్రీకరణ పూర్తి ఐయ్యింది. ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. 2017 మార్చ్ లో చిత్రం విడుదల కానుంది. తమిళంలో స్వయంగా మణి రత్నం తన నిర్మాణ సంస్థ మద్రాస్ టాకీస్ లో చిత్రాన్ని నిర్మించగా, ఓకే బంగారం తెలుగులో విడుదల చేసిన దిల్ రాజు ఈ చిత్రాన్ని కూడా తెలుగు లో అనువదిస్తున్నారు.

త్వరలో ఈ చిత్రానికి తెలుగు టైటిల్ ఖరారు చేసి తెలుగు పోస్టర్ ను విడుదల చెయ్యనున్నారు నిర్మాత దిల్ రాజు

Similar News