దశాబ్ద కాలం క్రితం వెండి తెరకు పరిచయం ఐన తమన్నా నేటికీ అగ్ర స్థాయి చిత్రాలలో అవకాశాలు అందిపుచ్చుకుంటుంది. విజయ దశమికి హిందీ, తెలుగు భాషలలో అభినేత్రి గా, తమిళంలో దేవి గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన తమన్నా ను ప్రేమమ్ మాయలో పడ్డ తెలుగు ప్రేక్షకులు పెద్దగా పట్టించుకోలేదు కానీ, తమిళ్ మరియు హిందీ సినిమా ప్రేక్షకులు ఈ అభినేత్రి ని బాగానే ఆదరిస్తున్నారు. ఈ విజయానందంలో మునిగి తేలుతున్న తమన్నా ముంబైలో పత్రికా పాత్రికేయులతో ముచ్చటించింది.
ఒక పాత్రికేయుడు పారితోషికాలు అధికంగా తీసుకుంటున్న నాయికల్లో మీ పేరు వినపడుతుంది కదా అని వేసిన ప్రశ్నకు సమాధానం ఇస్తూ, "కథానాయకుల కన్నా కథానాయికల పారితోషికాలు ఎన్నో రేట్లు తక్కువ. కానీ వీటినే భారీ పారితోషికాలు అంటున్నారు. నటిస్తున్నందుకు తీసుకుంటున్నాం కానీ ఊరికే ఏ నిర్మాత ఐనా నష్టం భరిస్తూ అధిక పారితోషికాలు ఎందుకు చెల్లిస్తారు? ఐనా కథానాయికలు అధిక మొత్తం కోరటంలో తప్పు ఏంటి? నా విషయానికి వస్తే నేను నూతన హీరోల చిత్రాలలో ప్రత్యేక గీతాలకు అధిక సొమ్ము పుచ్చుకుంటున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఆ వార్తలు వాస్తవమే. నా నృత్యం నచ్చి నా దగ్గరకు వచ్చే నిర్మాతకు నేను ముందే పారితోషికపు షరతులు చెప్తున్నాను. వారు కూడా అన్నిటికి ఇష్టపడే అవకాశం ఇస్తున్నారు. ఇది తప్పు అని నాకు అయితే ఏమి అనిపించట్లేదు." అని ఏ రహస్యం లేకుండా బైట పెట్టేసింది తమన్నా.
ఇదే విజయ దశమి కి కన్నడ, తెలుగు భాషల్లో విడుదల ఐనా భారీ బడ్జెట్ చిత్రం జాగ్వార్ లో తమన్నా ప్రత్యేక గీతంలో కనిపించిన సంగతి విదితమే.