తమిళం లోనే కాక ఇతర భాషల్లోనూ భారీ చిత్రాల దర్శకుడు శంకర్ తెరకెక్కించే చిత్రాలకు క్రేజ్, అంచనాలు, ఓపెనింగ్స్, వసూళ్లు అన్ని ఎక్కువే. తన ప్రతి చిత్రాన్ని దాదాపు రెండు సంవత్సరాలకు పైగా చిత్రీకరణ జరిపే శంకర్ తన చిత్రాల కథానాయికలకు చిత్రీకరణ సమయంలో మరే ఇతర చిత్రాలు ఒప్పుకోకూడదు అనే ఒప్పందం మీద తీసుకుంటాడు. అయితే ఈ షరతును ఇప్పుడు అమీ జాక్సన్ కోసం సడలించుకున్నాడు అనుకోండి. అయితే కథానాయికలకు పారితోషికం కూడా భారీగానే ముడుతుంటుంది శంకర్ సినిమాలకు. ఇవన్నీ పక్కన పెడితే శంకర్ సినిమాలకు పని చేయటానికి జంకుతుంటారు కొందరు కథానాయికలు.
శంకర్ దర్శకత్వంలో అపరిచితుడు చిత్రంలో నటించిన సదా, శివాజీ లో చేసిన శ్రీయ శరన్, రోబో లో చేసిన ఐశ్వర్య రాయ్ బచ్చన్, స్నేహితుడు లో చేసిన ఇలియానా లాంటి ప్రముఖ కథానాయికలు అందరూ ఆయా చిత్రాల విజయాల తరువాత కెరీర్లో ఊహించని పతనాన్ని చూడాల్సి వచ్చింది. శంకర్ గత చిత్రంలో ఐ లో నటించిన అమీ జాక్సన్ కు పై జాబితాలో పేర్కొన్న కథానాయికలకు ఉన్నంత క్రేజ్ కూడా లేదు. పైగా ఐ చిత్రం నిరాశనే మిగిల్చింది. ఈ తరుణంలో శంకర్ దర్శకత్వంలో 2 .0 లో కూడా నటిస్తున్న అమీ జాక్సన్ కి భవిష్యత్ అవకాశాలు ఎలా వుంటాయో మరి?
అయితే అమీ జాక్సన్ కి లభించిన ఒక ఊరట ఇతర చిత్రాల ఒప్పందాలు కూడా కుదుర్చుకోగలగటం. 2 .0 చిత్రంలో నటిస్తూనే బాలీవుడ్ లో ఒక చిత్రంతో పాటు క్వీన్ తమిళ రీమేక్ లో ఒక కీలక పాత్రను పోషించనుంది అమీ జాక్సన్.