బేతాళుడు దెబ్బకు రాంచరణ్ భయపడ్డాడా?

Update: 2016-11-20 07:00 GMT

విజయదశమికి విడుదల చేస్తాం అని ప్రకటించిన ధ్రువ చిత్రాన్ని నాన్చి నాన్చి డిసెంబరు 2న మీ ముందుకు వచ్చేస్తున్నాం అని ప్రకటించారు. కానీ తాజాగా రాంచరణ్ – ధ్రువ చిత్రాన్ని ఒక వారం వెనక్కి నెట్టారు . డిసెంబరు 9న విడుదల కాబోతున్నట్లు తేల్చారు. ఎందుకిలా జరిగింది. నోట్ల రద్దు ఎఫెక్ట్ అంటున్నారు గానీ.. ‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’ లాంటి సినిమాలు బాగానే ఆడుతున్నాయి కదా.. నోట్ల దెబ్బ లేదు కదా.. అనే అనుమానాలు పలువురిలో ఉన్నాయి.

ఇండస్ట్రీలో వినిపిస్తున్న గుసగుసల ప్రకారం.. తమిళ హీరో విజయ్ ఆంటోనీ చేసిన భేతాళుడు చిత్రం కూడా డిసెంబరు 2న విడుదల కాబోతున్న నేపథ్యంలో దానితో పోటీ ఎందుకు లెమ్మని... ధ్రువ చిత్రాన్ని ఓ వారం వెనక్కి నెట్టినట్లు తెలుస్తోంది. అభిరుచిగల, జనాన్ని మెప్పించే మంచి చిత్రాలు తీసే హీరోగా విజయ్ ఆంటోనీకి పేరుంది.

అతని ఇటీవలి చిత్రం.. ‘బిచ్చగాడు’ తెలుగులో ఎంత సూపర్ హిట్ అయిందో అందరికీ తెలుసు. బిచ్చగాడు విడుదల అయి థియేటర్లలో రన్ అవుతూ ఉండగానే.. ఎన్టీఆర్ జనతా గ్యారేజ్ రావడమూ పోవడమూ కూడా జరిగిపోయింది.. అప్పటికీ బిచ్చగాడు రన్ అవుతూనే ఉంది! అంతగొప్ప విజయం సాధించింది.

అలాంటి విజయ్ ఆంటోనీ తర్వాతి చిత్రగా భేతాళుడు వస్తోంది. దీని మీద కూడా మంచి అంచనాలు ఉన్నాయి. దానితో పోటీ పడి డిసెంబరు 2న వస్తే బాక్సాఫీసు వద్ద బోల్తా కొట్టడం కంటె.. ఓ వారం భేతాళుడు రన్ అయిన తర్వాత.. 9వ తేదీన వస్తే సేఫ్ గా ఉంటుందని ధ్రువ టీమ్ భావించినట్లుగా చెబుతున్నారు. హతవిధీ ... ఇదే నిజమైతే.. డబ్బింగ్ చిత్రం దెబ్బకు మెగా హీరో చిత్రం వాయిదా పడడం ఎలాంటి పరిణామమో కదా!

Similar News