బాలీవుడ్ లో క్రితి స్థాయి మారిపోయింది

Update: 2016-10-29 08:05 GMT

ఎన్నో చిత్రాల అనుభవం ఉంటే తప్ప బాలీవుడ్ లో కథానాయికల కోసం ప్రత్యేకమైన పాత్రలు పుట్టటం జరుగదు. కహాని, ది డర్టీ పిక్చర్ వంటి చిత్రాలలో లీడ్ రోల్ చేసి తెర పై పూర్తి చిత్ర నిడివి భాధ్యతను భుజాలపై మోసిన విద్య బాలన్ కూడా గతంలో సహా నటిగా, కమర్షియల్ కథానాయికగా చేసిన నటీమణే. అదే కోవకి చెందుతారు క్వీన్ చిత్రంతో బాలీవుడ్ కే క్వీన్ అయిపోయిన కంగనా రనౌత్. 2012 లో విడుదలైన క్వీన్ సృష్టించిన సంచలనంతో కంగనా రనౌత్ కోసం పాత్రలు సృష్టిస్తున్నారు బాలీవుడ్ దర్శక రచయితలు.

సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన 1 నేనొక్కడినే తో వెండి తెరకు పరిచయం ఐన క్రితి సనన్ తరువాత దోచేయ్ చిత్రంతో పాటు మరో రెండు హిందీ చిత్రాల్లో నటించింది. ఇలా మొత్తం కలిపి నాలుగు చిత్రాలలో నటించిన అనుభవంతోనే కథానాయికకు అభినయం ప్రదర్శించే వెసులుబాటు ఉన్న పాత్రను తన ఖాతాలో వేసుకుని అందరిని అబ్బురపరిచింది క్రితి సనన్. అదికూడా హిందీలో చేసిన రెండు చిత్రాలు పెద్ద గుర్తింపు తేకుండానే బెర్లి కి బర్ఫీ అనే చిత్రంలో ప్రధాన పాత్ర పోషిస్తుంది.

బెర్లి కి బర్ఫీ చిత్రంలో కంగనా రనౌత్ కూడా ప్రధాన పాత్ర పోషిస్తుండటంతో కచ్చితంగా నటనకు పెద్ద పీట వేసే చిత్రంగానే భావిస్తున్నారు అందరూ. మరి ఇంత త్వరగా వచ్చిన గొప్ప అవకాశాన్ని క్రితి సనన్ ఎంత వరకు సద్వినియోగ పరుచుకుంటుందో చూడాలి.

Similar News