బాలీవుడ్ యాక్షన్ నచ్చటం లేదుట

Update: 2016-10-16 11:31 GMT

బాలీవుడ్ హీరో అజయ్ దేవగన్ దర్శకుడిగా మారి చేస్తున్న రెండో ప్రయత్నం శివాయ్. ఈ నెల 28 న ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సన్నద్ధమవుతుంది. శివాయ్ చిత్రానికి సంబంధించిన ప్రచార కార్యక్రమాలలో చురుగ్గా పాల్గొంటున్నాడు అజయ్ దేవగన్. శివాయ్ చిత్రానికి హీరో, నిర్మాత, దర్శకుడు ఆయనే. గ్రాఫిక్స్ మరియు విజువల్ ఎఫెక్ట్స్ కి ఎక్కువ ప్రాధాన్యం వున్న కథ అని ముందు నుంచి ప్రచారం చేస్తూనే వున్నారు. ఆ విషయాన్ని శివాయ్ ప్రచార చిత్రం లోని కొన్ని ఫ్రేమ్లు ఇప్పటికే నిరూపించాయి. ఈ చిత్రంలో అదే స్థాయిలో యాక్షన్ కూడా వుండబోతోంది.

యాక్షన్ కొరియోగ్రాఫర్ వీర్ దేవగన్ వారసుడిగా బాలీవుడ్ కి పరిచయం ఐన అజయ్ దేవగన్ తన తాజా చిత్రం శివాయ్ ప్రచారంలో కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేసాడు. "బాలీవుడ్ లో తరచు వస్తున్న యాక్షన్ చిత్రాలలోని యాక్షన్ సీక్వెన్సెస్ బాగా బోర్ కొడుతున్నాయి. ఏ మాత్రం కొత్తదనం లేని ఒక మూస ధోరణిలో యాక్షన్ సన్నివేశాలు చిత్రీకరణ జరుగుతున్నాయి. మా శివాయ్ చిత్రంలో మాత్రం యాక్షన్ సన్నివేశాలు చాలా కొత్తగా ఉంటాయి. ప్రేక్షకులు అబ్బురపోయేలా ప్రతి స్టంట్ని తీర్చిదిద్దాము." అని ఇతర సినిమాలలో వస్తున్న పేలవమైన యాక్షన్ సన్నివేశాలను తన చిత్ర ప్రచారానికి వాడేసుకున్నాడు అజయ్ దేవగన్.

అజయ్ దేవగన్ తొలి సారి 2008 లో యూ మీ ఔర్ హమ్ అనే చిత్రానికి దర్శకత్వం వహించాడు. మళ్లీ ఆరు సంవత్సరాల తరువాత శివాయ్ చిత్రానికి దర్శకత్వం వహించాడు.

Similar News