నట సింహం నందమూరి బాల క్రిష్ణ తన 100 వ చిత్రం ఐన గౌతమీ పుత్ర శాతకర్ణి చిత్రీకరణలో బిజీగా వుంటున్నారు. ప్రస్తుతం ఈ చిత్రం రామోజీ ఫిలిం సిటీ లో చిత్రీకరణ జరుపుకుంటుంది. ఇతర నటీనటుల చిత్రాల చిత్రీకరణలకు వెళ్లే అలవాటు లేని బాలయ్య, బాలీవుడ్ మెగా స్టార్ అమితాబ్ బచ్చన్ నటిస్తున్న సర్కార్ 3 చిత్రీకరణ రామోజీ ఫిలిం సిటీ లోనే జరుగుతుంది అని తెలుసుకుని షాట్ గ్యాప్‌లో సర్కార్ 3 సెట్స్ ను సందర్శించి అందరిని ఆశ్చర్యపరిచారు. ఆ సమయంలో అక్కడ అమితాబ్ బచ్చన్‌తో పాటు దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కూడా వున్నారు.
నందమూరి బాల క్రిష్ణ అంటే భోళా మనిషి అని తెలుగు చిత్ర పరిశ్రమలో అందరూ అంటుంటారు. ముక్కు మీద కోపం వుండే వ్యక్తే అయినా గౌరవ మర్యాదలు తెలిసిన వ్యక్తి అని ఎందరో పెద్దలు బాలయ్యను కొనియాడటం తెలిసిందే. అయితే అమితాబ్ బచ్చన్ ఆప్యాయతతో కూడిన ఆలింగనం చేసుకోబోతుంటే ముందు ఆయన పాదాలకు నమస్కారం చేసి తరువాత ఆలింగనం చేసుకుని తన సంస్కారాన్ని మరొక సారి చాటుకున్నారు. బాలయ్య అభిమానానికి, మర్యాదకి అమితాబ్ బచ్చన్ మంత్ర ముగ్ధులు అయ్యారంటే అతిశయోక్తి కాదు.
అయితే ఈ ప్రత్యేక భేటీ లో మర్మం ఏమిటో ఎవరికీ అంతు పట్టటం లేదు. ఇక రామ్ గోపాల్ వర్మ ట్విట్టర్ లో ఏదైనా చెప్తాడేమో చూడాలి...