బచ్చన్ సాబ్ చిత్రానికి బ్రేకులేసిన కోర్టు

Update: 2016-10-26 06:15 GMT

సంచలనాత్మక దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సక్సెస్ రేట్ తక్కువ వున్న దర్శకుడైనా ఆయనది తరగని గుర్తింపు. కారణం ఆయనకి వున్న కొద్ది పాటి విజయాల ప్రభావం ప్రేక్షకుల పై అంతలా ఉంటుంది. శివ, గాయం, రంగీలా, సర్కార్, రక్త చరిత్ర, 26/11 అటాక్స్ లాంటి చిత్రాలు అన్ని ఆ కోవకి చెందినవే. వర్మ పరాజయాలు కూడా తీవ్ర ప్రభావమే చూపుతాయి. అయితే వర్మ స్థాయి విజయాలలో బాలీవుడ్ మెగా స్టార్ అమితాబ్ బచ్చన్ తో చేసిన సర్కార్ కి వుండే ప్రత్యేకత వేరు.

సర్కార్ చిత్రం లోని పాత్రలు నేటికీ ప్రేక్షకులకు గుర్తే. గాడ్ ఫాదర్ చిత్రాన్ని అమితంగా ఆరాధించే రామ్ గోపాల్ వర్మ ఆ చిత్రం స్ఫూర్తితోనే సర్కార్, సర్కార్ 2 చిత్రాలు తెరకెక్కించారు. ఇప్పుడు సర్కార్ 3 చిత్రీకరణ ఇటీవల రామోజీ ఫిలిం సిటీ లో జరుపుకుని ఇప్పుడు ముంబై నగరంలో చిత్రీకరణ జరుపుకుంటుంది. కానీ ఇప్పుడు ఊహించని అవాంతరం ఎదురైయింది సర్కార్ 3 కి. సర్కార్ చిత్రం పై, ఆ చిత్ర కథ కథనాల పై, పాత్రల పై పూర్తి హక్కులు తనకే సొంతం అని నిర్మాత నరేంద్ర హిరావత్ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు.

సర్కార్ లోని పాత్రల ఆధారంగానే ప్రస్తుత సీక్వెల్ చిత్రీకరణ జరుగుతుండగా నరేంద్ర హిరావత్ చిత్రీకరణ నిలిపి వేసే విధంగా న్యాయస్థానం నుంచి ఉత్తర్వులు జారీ చేసారు. సర్కార్ సీక్వెల్ లేక ప్రీక్వెల్ దేని హక్కులైనా తనకే సొంతమని,తన ప్రమేయం లేకుండా వాటి చిత్రీకరణ జరపటం చట్ట రీత్యా నేరం అని నరేంద్ర హిరావత్ పేర్కొన్నారు. మరి వర్మ ఏ విధంగా స్పందిస్తారో చూడాలి.

Similar News