ప్రమోషన్ ప్లానింగ్ అదరగొడుతున్నారు

Update: 2016-11-23 10:17 GMT

రామ్‌చరణ్‌ హీరోగా గీతాఆర్ట్స్‌ బేనర్‌లో అల్లుఅరవింద్‌ నిర్మాతగా. 'మగధీర' తర్వాత ఆ స్దాయిలో చరిత్ర సృష్టించాలని మెగాభిమానులు కోరుకుంటున్న చిత్రం 'ధృవ'. సురేందర్‌రెడ్డి దర్శకత్వంలో తమిళ సూపర్‌హిట్‌ 'తని ఒరువన్‌'కు రీమేక్‌గా రూపొందుతున్న ఈ చిత్రం షూటింగ్‌తో పాటు సెన్సార్‌కార్యక్రమాలు కూడా పూర్తయ్యాయి. 'యు/ఎ' సర్టిఫికేట్‌ అందుకున్న ఈ చిత్రం డిసెంబర్‌9న విడుదల కానుంది. ఇక్కడ ఒక్క విషయం ముఖ్యంగా చెప్పుకోవాలి. స్టార్‌ హీరోల చిత్రాలతో పాటు ఎన్నో చిత్రాలు విడుదల తేదీ దగ్గరపడుతున్నప్పటికీ సెన్సార్‌ కార్యక్రమాలు ముగించి, సినిమా విడుదల తేదీ విషయంలో నానా తిప్పలు పడుతున్న సంగతి తెలిసిందే. కానీ 'ధృవ'చిత్రం విడుదలకు 20రోజుల ముందే సెన్సార్‌ సర్టిఫికేట్‌ను పొందింది. ఈ ముందుచూపు ఇతర దర్శకనిర్మాతలకు, చివరికి రిలీజ్‌ డేట్‌ ప్రకటించిన తర్వాత కూడా సినిమాను పూర్తి చేయకుండా అందరినీ సందిగ్దంలోకి నెట్టే స్టార్స్‌కు అవసరం. ఇక ప్రస్తుతం 'ధృవ' టీమ్‌ ప్రమోషన్ల వేగం పెంచింది.

ఈనెల 26న ఈ చిత్రం ప్రీరిలీజ్‌ ఫంక్షన్‌ అత్యంత వేడుకగా జరగనుంది. ఇకపోతే ఇటీవల వరుసగా చరణ్‌ చిత్రాలు నిరాశపరుస్తున్న నేపధ్యంలో 'ధృవ' చిత్రం చరణ్‌ ముందు కొన్ని లక్ష్యాలను నిర్దేశించింది. ప్రస్తుతం చరణ్‌కు ఓ పెద్దహిట్‌ అవసరం. దాన్ని 'ధృవ' అందించాల్సివుంది. ఇక ఓవర్‌సీస్‌లో చరణ్‌కు నాని, నితిన్‌ల కంటే తక్కువ మార్కెట్‌ ఉందనేది వాస్తవం. చరిత్ర సృష్టించిన 'మగధీర' చిత్రం కూడా అక్కడ మిలియన్‌ మార్క్‌ను అందుకోలేదు. ముఖ్యంగా వైవిధ్యభరితమైన చిత్రాలను ఎక్కువగా ఆదరించే ఓవర్‌సీస్‌ ప్రేక్షకులను 'ధృవ'చిత్రం బాగా ఆకట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈ చిత్రం కూడా వైవిధ్యభరితమైన చిత్రం కావడంతో ఆ లక్ష్యాన్ని ఈ చిత్రం చేరుకోవాల్సివుంది. ఇక ఈ చిత్రం తమిళ 'తని ఒరువన్‌'కు రీమేక్‌గా రూపొందుతుండటంతో ఆ చిత్రం తమిళ వెర్షన్‌ను ఇప్పటికే ఎందరో వివిధ రూపాల్లో చూసేశారు. కాబట్టి ఈ చిత్రానికి, ఒరిజినల్‌ వెర్షన్‌కు మధ్య కంపేరిజన్‌ వస్తుంది. తమిళ ఒరిజినల్‌ కంటే తెలుగు వెర్షన్‌ ఇంకా బాగుంటేనే అందరూ ఆదరిస్తారు. కాబట్టి దాన్ని కూడా చరణ్‌ అధిగమించాల్సివుంది. మొత్తం మీద 'ధృవ' చిత్రం చరణ్‌ చేరుకోవాల్సిన లక్ష్యాలను సాదిస్తుందో లేదో వేచిచూడాల్సివుంది.

Similar News