ప్రముఖ నటులు రాజ్ కుమార్ నట వారసులలో ఒకరు ఐన కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ ప్రస్తుతం దేశాన్ని అట్టుడికిస్తున్న సర్జికల్ స్ట్రైక్స్ నేపథ్యంలో బాలీవుడ్ లో నిరంతరాయంగా చర్చ జరుగుతున్న పాకిస్థాన్ దేశస్థులైన నటీనటులను నిషేధించటంపై స్పందించారు. "నాకు సంబంధించినంత వరకు మహారాష్ట్ర నవ నిర్మాణ సంస్థ చేపడుతున్న చర్యలు సమర్ధించదగినవే. కళాకారుడి కుటుంబంలో పుట్టి పెరిగి, స్వతహాగా కళాకారుడినైన నాకు కళపై చాలా గౌరవం ఉంది. అలానే ఏ కళకి సంబంధించిన కళాకారులకైనా కళని నమ్ముకుని ఎదగటం సులభ తరం కాదు. ఎన్నో ఆటు పోట్లు ఎదుర్కొంటు కూడా కళపై మమకారంతో కష్ట పడుతుంటారు. కానీ నేను కళకన్నా, కళాకారులకన్నా కూడా అమితంగా దేశాన్ని ప్రేమిస్తాను. అందుకే ప్రస్తుతం భారత్ దేశం చేపట్టిన సర్జికల్ స్ట్రైక్స్ కి నా మద్దతు తెలుపుతున్నాను. మన దేశంలో వివిధ చిత్ర పరిశ్రమలలో ఉన్న పాకిస్థానీ కళాకారులను నిషేధించాలి." అని పునీత్ రాజ్ కుమార్ తన అభిప్రాయాన్ని వ్యక్త పరిచారు.
కథానాయిక సంజన గల్రాని, కన్నడ దర్శకుడు పవన్ ఒడియార్ కూడా పాకిస్థానీ కళాకారుల నిషేధమే సరైన నిర్ణయమని ప్రకటించారు. మరో వైపు బాలీవుడ్ దర్శక నిర్మాత కరణ్ జోహార్ పాకిస్థానీ కళాకారులకి మద్దతు పలికి ఆయన తాజా చిత్రం హే దిల్ హై ముష్కిల్ విడుదలకు ఆటంకాలు ఎదుర్కొంటున్నారు.