నోటు దెబ్బ తప్పించుకున్న ‘చిన్నవాడు’

Update: 2016-11-19 06:20 GMT

నోట్ల రద్దు అనే అంశం తెరమీదకు రాగానే.. వెండి తెర చిన్నబోయింది. సినిమాలు చూసే ప్రేక్షకుల సంఖ్య ఒక్కసారిగా డ్రాప్ అయిపోయింది. సినిమా థియేటర్లలో పాతనోట్లు తీసుకోకపోవడం, తమ వద్ద ఉన్న చిల్లర నోట్లను సినిమా వంటి విలాసాలకు ఖర్చు పెడితే, అవసరాలకు ఇబ్బంది వస్తుందనే భయంతో అసలు జనం సినిమా దిక్కే చూడడం మానుకున్నారు. ఈ నేపథ్యంలో కొన్ని సినిమాలు కలెక్షన్లు ఉండవనే భయంతో విడుదలనే వాయిదా వేసుకున్నాయి.

అయితే నిఖిల్ హీరోగా విఐ ఆనంద్ దర్శకత్వంలో రూపొందిన థ్రిల్లర్ ‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’ చిత్రాన్ని మాత్రం ఎలాంటి సంకోచాలు లేకుండా.. విడుదల చేశారు. పేరుకు చిన్న చిత్రమే అయినప్పటికీ.. చక్కటి స్క్రీన్ ప్లే, మంచి మేకింగ్ విలువలతో సినిమా ఆకట్టుకుంటోందని సమాచారం. అయితే.. ఇండస్ట్రీ చాలా వరకు భయపడినట్లుగా నోట్ల రద్దు దెబ్బ, ఈ ‘చిన్నవాడి’ మీద ఎంతమాత్రమూ లేదని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.

సాధారణంగా విభిన్నమైన కథాంశాలతో ఉండే నిఖిల్ చిత్రాలు ఏ సెంటర్లలో బాగా ఆడుతుంటాయి. అయితే ఇది థ్రిల్లర్ గనుక అన్ని క్లాస్ ల సెంటర్లలో ఆదరణ ఉంటుందని యూనిట్ ఆశించింది. దానికి తగినట్లుగానే అన్నిచోట్లా సినిమాకు కలెక్షన్ల పరంగా మంచి స్పందన లభిస్తున్నట్లుగా తెలుస్తోంది. పైగా థియేటర్లలో మరో మంచి చిత్రం లేకపోవడం కూడా ఈ ‘చిన్నవాడి’కి ఎడ్వాంటేజీ అయిందని.. మంచి కలెక్షన్లతో.. నిఖిల్ కెరీర్లో మరో సూపర్ హిట్ నమోదు చేసే దిశగా దూసుకుపోతున్నాడని తెలుస్తోంది.

Similar News