ధ్రువ కు దుబ్ స్మాష్ ల ప్రచారం

Update: 2016-11-15 16:31 GMT

బ్రూస్ లీ వంటి ఘోర పరాజయం తరువాత బాగా ఆచి తూచి అడుగులు వేస్తున్నప్పటికీ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ తాజా చిత్రం ధ్రువ ముందుగా ప్రకటించిన విడుదల తేదీ ప్రకారం విజయ దశమికి విడుదల కాలేక ఒక సారి వాయిదా పడింది. వచ్చే నెలలో విడుదల ఖాయం అని కచ్చితంగా చెప్తున్న మెగా నిర్మాత అల్లు అరవింద్ ఆ ప్రణాళిక ప్రకారమే చిత్రీకరణ పూర్తి చేసి నిర్మాణాంతర కార్యక్రమాలను శర వేగంగా జరుపుతున్నారు. ఇప్పటికే 70 శాతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా పూర్తి అయిపోయాయి. కానీ డిసెంబర్ ప్రధమ, ద్వితీయ వారాల్లో కూడా విడుదల కచ్చితంగా ఖాయం చెయ్యలేని పరిస్థితి ఎదుర్కుంటున్నారు నిర్మాత.

పెద్ద నోట్ల రద్దు సినిమా వ్యాపారంపై చూపిస్తున్న తీవ్ర ప్రభావమే ఇందుకు కారణం. పోయిన వారం శుక్రవారం విడుదలైన సాహసం శ్వాసగా సాగిపో చిత్రం మంచి స్పందన తెచ్చుకున్నప్పటికీ వసూళ్లు మరీ పేలవంగా వున్నాయి. ఈ తరుణంలో చాలా చిత్రాలు విడుదల వాయిదా వేశారు. ఇప్పుడు ధ్రువ చిత్రానికి ఇదే పరిస్థితి ఎదురయ్యే ప్రమాదం ఉండటంతో ముందుగా అనుకున్న వరంగల్ లో ప్రీ రిలీజ్ కార్యక్రమంతో అయినా ప్రచారం లో ధ్రువ చిత్రాన్ని ప్రేక్షకులకు చేరువలో ఉంచాలని అనుకున్నారు కానీ ఇప్పటి పరిస్థులలో అది కూడా సాధ్య పడటం లేదు.

కానీ ధ్రువ చిత్ర నిర్మాత అల్లు అరవింద్ కు శ్రమ తగ్గిస్తూ సోషల్ మీడియాలో యువత దుబ్ స్మాష్ లతో ధ్రువ చిత్ర పాటలని బాగా ప్రమోట్ చేస్తున్నారు. విడుదల వాయిదా పడినప్పటికీ చిత్రానికి అభిమానులు కావాల్సిన ప్రచారం కలిపిస్తుండటంతో ఊపిరి పీల్చుకుంటున్నారు రామ్ చరణ్.

Similar News