ధనుష్ జీవితంలో ట్విస్టుల మీద ట్విస్టులు!

Update: 2016-11-26 10:54 GMT

సూపర్ స్టార్ రజినీకాంత్ అల్లుడు ధనుష్ కి ఎవరికీ రాని కష్టం వచ్చింది. సూపర్ స్టార్ అల్లుడనే కాదు ధనుష్ కూడా తమిళ్ లో పెద్ద స్టార్. అతను స్వశక్తితో పైకి వచ్చినవాడు... కాబట్టే రజిని మెచ్చి తన కూతురికిచ్చి పెళ్లి చేసాడు. అయితే ఇప్పుడు ధనుష్ ఒక సమస్యతో నలిగిపోతున్నాడట. అదేమిటంటే ధనుష్ కి తల్లితండ్రులు మేమె అంటూ కొంతమంది రావడమే అసలు సమస్య. మరి ధనుష్ తండ్రి డైరెక్టర్ కస్తూరిరాజా కదా అనుకుంటున్నారా...! అవును డైరెక్టర్ కస్తూరిరాజా ధనుష్ తండ్రి అని అందరికి తెలుసు. కానీ ధనుష్ ని కన్నది, పెంచింది మేమె అంటూ మధురైకి చెందిన దంపతులు కొన్ని రోజుల ముందు కోర్టు లో పిటిషన్ కేసు వేశారు. దీన్ని విచారించిన కోర్టు ధనుష్ ని కోర్టుకి హాజరవ్వాలని సమన్లు జారీ చేసింది.

అదలా ఉండగా మళ్ళీ ధనుష్ పెళ్లి సమయం లో కూడా ఒక వ్యక్తి ధనుష్ తన కొడుకంటూ హల్ చల్ చేసాడని వార్తలొచ్చాయి. ఇక ధనుష్ తండ్రి డైరెక్టర్ కస్తూరిరాజా ఆ వ్యక్తి పై కేసు వెయ్యడంతో అప్పట్లో ఆ విషయం సమసిపోయింది. అయితే మధురై దంపతులు మాత్రం ధనుష్ మా కొడుకే అని డి.ఎన్.ఏ టెస్టులకి కూడా సిద్ధపడడం ఇప్పుడు సంచలనం రేపుతోంది. ఇక వీరు తమ కొడుకు ధనుష్ అసలు పేరు కలైసెల్వన్‌ అని... 10 వ తరగతి చదువుతున్నప్పుడే సినిమాల్లో నటించాలని చెన్నై వెళ్లిపోయాడని చెబుతున్నారు. ఇక అప్పటినుండి తమకి దూరమై పోయాడని అంటున్నారు.

అంతేకాకుండా ధనుష్ తమ కొడుకే అనటానికి తమ దగ్గర ఆధారాలున్నాయని చెబుతున్నారు. అందుకే ఈ ముసలి వయసులో తమ కన్న కొడుకు దగ్గర ఉండాలని తాము ఆశ పడుతున్నామని వారు చెబుతున్నారు. మరి అసలు ధనుష్ కి నిజం గానే మధురై దంపతులు తల్లితండ్రులా? మరి వీరు తల్లితండ్రులైతే కస్తూరిరాజా ఎవరు? కస్తూరిరాజా నిజం గా ధనుష్ తండ్రి కాడా? అని కోలీవుడ్ మీడియాలో అప్పుడే చర్చమొదలైంది. ఇన్ని జరుగుతున్నా ధనుష్ మాత్రం ఏమి స్పందించకుండా మౌనం పాటిస్తున్నారు.

Similar News