చైతూ సినిమా ఇప్పట్లో లేనట్టే

Update: 2016-10-29 04:44 GMT

అక్కినేని నాగేశ్వర రావు మూడవ తరం నట వారసుడు ఐన అక్కినేని నాగ చైతన్య మాస్ కథానాయకుడుగా ఎదగాలనే తాపత్రయంతో అనేక ప్రయత్నాలు చేసి ఎదురు దెబ్బలు తిన్నారు. మళ్లీ ఆయనకు నప్పే ప్రేమ కథలు, కుటుంబ ప్రేక్షకుల అభిరుచికి తగ్గ కథలు ఎంచుకుంటూ భారీ విజయాలు కాకపోయినా పంపిణీదారులు ఊపిరి పీల్చుకునే విజయాలు అందిస్తున్నారు. ఇటీవల విజయ దశమి పండుగకి విడుదల ఐన ప్రేమమ్ చిత్రం కూడా వైవిధ్యమైన ప్రేమ కథ కాగా విడుదల ఆట నుంచే మంచి స్పందన వచ్చింది. కానీ అందరూ అనుకున్నట్టు 40 కోట్లు, 50 కోట్ల క్లూబ్లలో నాగ చైతన్య ని చేర్చలేకపోయింది ఈ చిత్రం. ఈ చిత్రానికి మాతృక ఐన మళయాళ ప్రేమమ్ చిత్రం గత ఏడాది విడుదలై 50 కోట్ల రూపాయలు వసూళ్లు చేసి మలయాళం ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది.

అయితే ఈ అక్కినేని హీరో తనకు తొలి విజయం అందించిన దర్శకుడు గౌతమ్ వాసుదేవ్ మీనన్ తెరకెక్కిస్తున్న సాహసం శ్వాసగా సాగిపో అనే ప్రేమ కథ పై చాలా ఆశలే పెట్టుకున్నాడు. ఆ చిత్రం చైతూ అంచనాలు చేరుకుంటుందో లేక అంచనాలు తయారు మారు చేస్తుందో తరువాత సంగతి, ముందు అసలు విడుదల కి నోచుకుంటుందో లేదో అర్ధంకాని పరిస్థితి ఏర్పడింది. తెలుగు వెర్షన్ కోసం చైతూ తన పని తాను సక్రమంగా పూర్తి చెయ్యగా, తమిళ వెర్షన్ హీరో శింబు పై ఎగసిపడ్డ వివాదాల ఆరోపణల కారణంగా ఆయన చిక్కుల్లో పది చిత్రీకరణకు సహకరించలేదు.

ఇంతలో గౌతమ్ వాసుదేవ్ మీనన్ ధనుష్ హీరో గా ఒక భారీ బడ్జెట్ చిత్రం మొదలు పెట్టటం, అది పూర్తి అయిపోవటం కూడా జరిగిపోయాయి. ఈ చిత్రం ఈ డిసెంబర్ నెలలో ప్రేక్షకులను పలకరిస్తుంది. అటు దర్శకుడు, ఇటు హీరో చైతూ ఎవరి కమిట్మెంట్స్ వారు పూర్తి చేసుకుంటున్నారు. మరి సాహసం శ్వాసగా సాగిపో చిత్ర నిర్మాత కష్టాన్ని పట్టించుకునేది ఎవరు? తీర్చేది ఎవరో?

Similar News