ఫిలింనగర్ కల్చరల్ క్లబ్ అనేది తెలుగు సినిమా ప్రపంచానికి సంబంధించి చాలా కీలకమైన రిక్రియేషన్ క్లబ్ లాంటిది. సినీ పరిశ్రమలోని పెద్దలు అనేక మంది ఇందులో కీలక సభ్యులుగా, సమన్వయ కర్తలుగా ఉంటారు. నడిపిస్తుంటారు. నిబంధనల పేరిట గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ ఈ క్లబ్ ను మూసివేసిన నేపథ్యంలో వారు తాజాగా న్యాయపోరాటం ద్వారా విజయం సాధించారు. క్లబ్ ను తిరిగి తెరవబోతున్నారు.
నిర్మాణంలో ఉన్న ఫిలింనగర్ కల్చరల్ క్లబ్ పోర్టికో కూలిపోయిన ప్రమాదం ఇటీవల జరిగింది. ఈ ప్రమాదం కొన్ని ప్రాణాలను బలిగొనడంతో అప్పటికప్పుడు గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ అధికారులు హఠాత్తుగా దీనిపై సీరియస్ అయ్యారు. క్లబ్ ను మూసివేశారు. అయితే కార్పొరేషన్ నిర్ణయంపై క్లబ్ యాజమాన్యం హైకోర్టును ఆశ్రయించింది. ఏళ్లుగా నిర్మాణం జరుగుతోంటే కార్పొరేషన్ వారు పట్టించుకోకుండా.. ప్రమాదం జరిగిన వెంటనే.. అనుమతులు లేని నిర్మాణం అంటూ అడ్డుకోజూడడం పై అప్పట్లో పలు విమర్శలు వచ్చాయి కూడా.
తాజాగా క్లబ్ ను తిరిగి తెరవడానికి అనుమతించాలంటూ హైకోర్టు గ్రేటర్ కార్పొరేషన్ ను ఆదేశించింది. న్యాయపోరాటం ద్వారా నెగ్గిన ఫిలింనగర్ క్లబ్ మళ్లీ ప్రారంభం కాబోతున్నది. కార్పొరేషన్ వేసిన బ్రేకులపై సినీ ప్రపంచం పోరాడి గెలిచినట్లుగా అయిందని పలువురు భావిస్తున్నారు.