ప్రపంచ వ్యాప్తంగా వున్న సంగీత ప్రియులకు కోల్డ్ ప్లే అనే మ్యూజిక్ బ్యాండ్ పేరు కచ్చితంగా పరిచయం వుంది తీరుతుంది. వెస్ట్రన్ మ్యూజిక్ లో ఆ బ్యాండ్ సృష్టించిన సంచలనం అటువంటిది. ఆ బ్యాండ్ లో స్వరాలు సమకూరుస్తూ గాత్రంతో కూడా అలరించే యూత్ ఐకాన్ క్రిస్ మార్టిన్. ఆయన తన సంగీత బృందంతో ప్రస్తుతం భారత దేశంలో జరుగుతున్న గ్లోబల్ సిటిజెన్ కాన్సర్ట్ కు విచ్చేసారు. క్రిస్ మార్టిన్ ఇచ్చిన మ్యూజిక్ షో తో సంగీత అభిమానులు ఉర్రూతలూగి పోయారు.
ఇదే కార్యక్రమానికి విచ్చేసిన ఆస్కార్ పురస్కార గ్రహీత ఎ.ఆర్.రెహమాన్ తన బృందంతో కలిసి వందేమాతరం ఆల్బమ్ లోని మాతుజే సలాం అనే పాటను ప్రదర్శించి అభిమానులను అలరించారు. ఆయన వేదికపై ఈ పాట ప్రదర్శిస్తూ క్రిస్ మార్టిన్ ని తనతో వేదిక పంచుకోమని ఆహ్వానించారు. క్రిస్ మార్టిన్ తో వందేమాతరం పాట పాడించారు. పూర్తిగా శాస్త్రీయ సంగీత నేపథ్యంలో సాగే ఈ పాట పాస్చాత్య సంగీతంలో మునిగి తేలే క్రిస్ మార్టిన్ గాత్రంతో వినటంతో సంగీత ప్రియులు తెలియని నూతన అనుభూతికి లోనయ్యారు. అదే వేదిక పై రెహమాన్ క్రిస్ మార్టిన్ కి అభినందనలతో పాటు తన కృతజ్ఞతలు తెలిపారు.