సినిమా కథ ఎంత విభిన్నంగా, వెరైటీగా ఉండాలని కోరుకుంటున్నారో.. ఈ తరం హీరోలు ఆయా చిత్రాల్లో తమ పాత్ర మరియు ఆ పాత్ర గెటప్ అంతే భిన్నంగా ఉండాలని ఆరాటపడుతున్నారు. నవతరం హీరోల చిత్రాల్లో ఇలాంటి ప్రయత్నం మనకు పుష్కలంగా కనిపిస్తుంది. ప్రస్తుతం ఎనర్జిటిక్ హీరో రామ్ కూడా అదే ప్రయత్నంలో ఉన్నాడు. సుదీర్ఘమైన కెరీర్ లో కొన్ని హిట్ లు తప్ప.. ఇటీవలి కాలంలో వైఫల్యాలే రుచిచూస్తున్న రామ్.. హైపర్ ఫ్లాప్ అయిన తర్వాత ఇప్పటిదాకా మరో చిత్రం జోలికెళ్లలేదు. ప్రస్తుతం తమిళ దర్శకుడు, ప్రేమకథా చిత్రాల్లో తనదైన ముద్ర ఉన్న కరుణాకరన్ తో చిత్రం చేయబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.
ఈ చిత్రం కోసమేనా అన్నట్లుగానే.. తన కెరీర్ లో ఇప్పటివరకూ ఎన్నడూ కనిపించని కొత్త తరహా గెటప్ లోకి రామ్ మారిపోయి అందరినీ ఆకట్టుకుంటున్నాడు. సరికొత్త హెయిర్ స్టయిల్, కోరమీసం, గడ్డంతో .. అసలే విలక్షణమైన హీరోగా పేరున్న రామ్.. తాజాగా సినిమా వాళ్ల ఫంక్షన్లలో మరింత విలక్షణంగా కనిపిస్తూ అతిథులను ఆశ్చర్య పరుస్తున్నాడుట. బాగా అలవాటైన రామ్ ఆహార్యాన్ని కొత్తగా చూస్తున్న వారంతా అభినందించలేకుండా ఉండలేకపోతున్నారట.
ప్రేమకథా చిత్రాలను కూడా తనదైన శైలిలో హృద్యంగా రూపొందించే భావుకత ఉన్న దర్శకుడిగా కరుణాకరన్ కు గుర్తింపు ఉంది. అతని తొలిచిత్రం తొలిప్రేమ తరువాత.. రూపొందించిన ఏ చిత్రమూ ఆ స్థాయిలో విజయం సాధించకపోయినప్పటికీ.. ఆ ఒక్క విజయమే అతనికి ఇప్పటికీ అవకాశాలు సంపాదించి పెడుతోందంటే అతిశయోక్తి కాదు. అలాంటి నేపథ్యంలో వీరి కొత్త గెటప్ ప్రయోగమైనా రామ్ కు మంచి హిట్ ఇస్తే బాగుణ్ను.