యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఇప్పుడు రాజమౌళి పుణ్యమా అని బాహుబలి తో దేశ వ్యాప్తంగా ఎనలేని గుర్తింపు సంపాదించుకున్నారు కాని, ప్రభాస్ కు మొదటి హిట్ ఇచ్చి అతనిని కమర్షియల్ హీరోల జాబితాలోకి ఎక్కించింది మాత్రం దర్శకుడు శోభనే. వర్షం చిత్రంతో వీరి కలయిక సంచలన విజయాన్ని నమోదు చేసింది. కాని చాలా పిన్న వయసులోనే మృత్యువు ఒడిలో చేరిపోయారు దర్శకుడు శోభన్. గత సంవత్సరం ఈ దివంగత దర్శకుడి వారసుడు సంతోష్ శోభన్ వెండి తెరకు పరిచయం అయ్యాడు.
ఉయ్యాల జంపాల వంటి చక్కటి కుటుంబ కథా చిత్రాన్ని నిర్మించిన రామ్ మోహన్ దర్శక నిర్మాణంలో వచ్చిన తాను నేను చిత్రంతో కథానాయకుడు అయ్యాడు సంతోష్ శోభన్. ఆ చిత్రంతో మల్టీప్లెక్స్ ప్రేక్షకుల నుంచి ప్రశంసలు పొందాడు. ఇప్పుడు సంచలన దర్శకుడు క్రిష్ణ వంశి దగ్గర శిష్యరికం చేసిన శ్రీనివాస్ చక్రవర్తి దర్శకత్వంలో ఒక చిత్రం చేస్తున్నాడు సంతోష్. ఈ చిత్ర చిత్రీకరణ ముహూర్తానికి వంశి పైడిపల్లి విచ్చేసి కెమెరా స్విచ్ ఆన్ చేసారు.
గతంలో దర్శకుడు శోభన్ కూడా క్రిష్ణ వంశి సింధూరం చిత్రానికి రచన సహకారం అందించటం తో పాటు, మురారి చిత్రానికి క్రిష్ణ వంశి దర్శక బృందం లో కో డైరెక్టర్ గా పని చేసారు.