ప్రముఖ నిర్మాణ సంస్థ పివిపి సినిమా ప్రతిష్టాత్మకంగా నిర్మించిన చిత్రం కాష్మోరా. కార్తీ, నయనతార, శ్రీ దివ్య ప్రధాన తారాగణంగా నటించిన ఈ చిత్రంలో కార్తీ మూడు విభిన్న పాత్రలు పోషించాడు. మొన్ననే సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న కాష్మోరా చిత్ర నిడివి 164 నిమిషాలు(రెండు గంటల 44 నిమిషాలు) గా తేలింది. సినిమాలో కథ ఎంతసేపు చెప్తున్నాం, కథలో నుంచి బైటకి వచ్చి ఎంతసేపు అనవసరమైన ట్రాక్స్ తో కాలయాపన జరిగింది అనే సమీక్ష చిత్రం విడుదల తరువాత ప్రేక్షకాదరణ కరువు అయితే జరుగుతుంది. అప్పుడు హడావిడిగా కొన్ని అనవసర సన్నివేశాలు కత్తిరించి కొంత నిడివి తగ్గించాం అని మళ్లీ కొత్త ప్రచారం మొదలుపెడతారు దర్శక నిర్మాతలు.
ఈ తంతు అంత ఎందుకు అనుకున్నారో ఏమో కాష్మోరా బృందం విడుదలకు ముందుగానే కావలిసిన జాగ్రత్తలు తీసుకుంది. సెన్సార్ పూర్తి ఐన తరువాత కూడా పన్నెండు నిమిషాల నిడివి తగ్గించింది. కాష్మోరా పాత్ర సాగే కథ ఫ్లాష్ బ్యాక్ లో కేవలం అరగంట సేపే కావటంతో అది మాత్రం కదపకుండా, కథ ప్రేక్షకులకు చేరే విధంగా జాగ్రత్తపడ్డాడు యువ దర్శకుడు గోకుల్. రీ ఎడిటెడ్ చిత్రపు నిడివి రెండు గంటల 32 నిమిషాల చిత్రపు నిడివితో రేపు తమిళ తెలుగు భాషల్లో విడుదల అవుతున్న కాష్మోరా పీవీపీ కి లాభం తెస్తుందో లేదో చూడాలి.
దాదాపు 60 కోట్ల రూపాయలతో నిర్మితమైన కాష్మోరా చిత్రాన్ని తెలుగు రాష్ట్రాల్లో కూడా భారీగా 600 కి పైగా థియేటర్లలో విడుదల చేస్తున్నారు.