కామెడీ చిత్రాలే మేలు అనుకుంటున్న నందమూరి హీరో

Update: 2016-11-23 19:50 GMT

నందమూరి హీరోలు అనగానే ఒకప్పుడు కేవలం మాస్ సినిమాలే గుర్తు వచ్చేవి. దివంగత నటులు నందమూరి తారక రామారావు పౌరాణిక, సాంఘిక, జానపద, చారిత్రాత్మక చిత్రాలు అన్నీ చేయగా, ఆయన నట వారసుడిగా నట జీవితం ప్రారంభించిన నందమూరి బాలి కృష్ణ తొలి దశాబ్దన్నర కాలంలో వివిధ రకాల కథనాలతో వైవిధ్యమైన పాత్రలు పోషించినప్పటికీ నేటి తరం యువతకు ఆయన మాస్ హీరోగానే సుపరిచితులు. అటువంటిది ఆయన కూడా డిక్టేటర్, గౌతమీ పుత్ర సార్ధకర్ణ లతో పంథా మార్చగా మరోపక్క తారక్ కుటుంబ ప్రేక్షకులకు చేరువ అయ్యాడు.

నందమూరి వంశం నుంచి వచ్చి నటుడిగా, నిర్మాతగా సొంత గుర్తింపు తెచ్చుకున్న మరో హీరో నందమూరి కళ్యాణ్ రామ్. అతనొక్కడే చిత్రంతో తొలి విజయం నమోదు చేసి, హరేరామ చిత్రంతో వైవిధ్య కథను తెరకెక్కించే అవకాశాన్ని దర్శకుడికి ఇచ్చి సక్సెస్ అయ్యారు. తరువాతి కాలంలో అనేక మాస్ కథలు నిర్మిస్తూ వాటిలో కథానాయకుడి పాత్రలు పోషించినా కళ్యాణ్ రామ్ ప్రేక్షకుల మెప్పు పొందలేకపోయారు. గత ఏడాది ఆయనకు అలవాటు లేని కామెడీ కాప్ పాత్రను పోషించి పటాస్ తో భారీ విజయం అందుకున్నారు. కాగా తదుపరి రెండు చిత్రాలు పాత తరహాలో ఎంచుకుని షేర్, ఇజమ్ తో మళ్లీ వెనుకంజలో ఉండిపోయారు.

ఇజమ్ పరాభవంతో ఆయనంతట ఆయన విశ్లేషణ చేసుకుని కామెడీ కథ చెయ్యాలని నిశ్చయించుకున్నారు. కామెడీ ని తెరపై అద్భుతంగా పండించగలిగిన జి.నాగేశ్వర రెడ్డి కి అవకాశం కలిపించనున్నారని సమాచారం. నాగేశ్వర రెడ్డి తెరకెక్కించిన ఇంట్లో దెయ్యం నాకేంటి భయం చిత్రం విడుదల తరువాత కళ్యాణ్ రామ్ చిత్రంపై స్పష్టత వచ్చే అవకాశం వుంది.

Similar News