కన్నడ డబ్బింగ్‌కు తెలుగు రాష్ట్రాల్లో 600 థియేటర్లు

Update: 2016-10-10 04:54 GMT

అనువాద చిత్రాల ఆధిపత్యం మన దగ్గర దశాబ్ద కాలంగా కొనసాగుతూనే ఉంది. అయితే వాటిల్లో తమిళ చిత్రాల అనువాదాలైతే ఇక్కడ చిన్న హీరోకు దొరికే థియేటర్లకన్నా తమిళ హీరోలకు దొరికే థియేటర్లే ఎక్కువ. ఇప్పుడిప్పుడే మళయాళ యువ నటులకు మార్కెట్ మన రాష్ట్రాల్లో ఏర్పడుతుంది. కానీ కన్నడ చిత్రాలకు మన దగ్గర ఆదరణ తక్కువే. అడపా దడపా ఉపేంద్ర లాంటి నటుల చిత్రాలకు 200 నుంచి 250 థియేటర్లు విడుదలకు అనుకూలిస్తాయి. అది కూడా ఆ శుక్రవారం తెలుగు చిత్రాల విడుదల సంఖ్య పై ఆధారపడి ఉంటుంది. అక్కడ స్టార్ హీరోలు ఐన పునీత్ రాజ్ కుమార్, శివ రాజ్ కుమార్ ల ముఖాలు కూడా ఇక్కడ చాలా మంది ప్రేక్షకులకు పరిచయం లేదు.

ఇప్పుడు ఒక కన్నడ చిత్రం ఏకంగా తెలుగు రాష్ట్రాల్లో 600 థియేటర్లలో విడుదలకు సిద్దమవుతూ అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. అయితే ఇక్కడ దర్శకుడి క్రేజ్ కూడా ఉపయోగపడింది లెండి. కోడి రామ క్రిష్ణ అనే పేరు ఎరుగని సినిమా అభిమానులు ఉండరు. సూపర్ స్టార్ క్రిష్ణ, చిరంజీవి, బాల క్రిష్ణ, వెంకటేష్ వంటి స్టార్ హీరోలతో సినిమాలు చేసిన అనుభవం ఉన్నా, ఆయన ఇప్పుడు కథా బలం, అందులోనూ సాంకేతిక నైపుణ్యాన్ని ప్రదర్శించే అవకాశం మెండుగా కలిపించే కథలను తెరకెక్కిస్తున్నారు. ఆయన దర్శకత్వం వహించిన నాగ భరణం ఈ నెల 14 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా కన్నడ, తెలుగు మరియు హిందీ భాషలలో విడుదలకు సన్నద్ధమవుతుంది.

నాగ భరణం చిత్ర పతాక సన్నివేశం కోసం దర్శకుడు కోడి రామ క్రిష్ణ అధునాతనమైన గ్రాఫిక్స్ తో దివంగత నటుడు విష్ణు వర్ధన్ ను మళ్లీ సృష్టించి భారత చలన చిత్ర పరిశ్రమలోనే కొత్త సాహసాన్ని తలపెట్టారు. చిత్రం ఆఖరి పది నిమిషాల వ్యవధిలో విష్ణు వర్ధన్ పాత్ర ప్రేక్షకుల మెప్పు పొంది తీరుతుంది అని విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు కోడి రామ క్రిష్ణ.

Similar News