సినిమా పరిశ్రమలో సక్సెస్ రేట్ కేవలం ఆరు శాతం అని సినీ విశ్లేషకులు చెప్తున్నారు. ఈ గణాంకాల ప్రకారం ఏడాదికి 100 చిత్రాలు విడుదల అయితే వాటిల్లో ఆరు చిత్రాలు మాత్రమే ఆడుతున్నాయి. అందుకే పరిశ్రమ వర్గాలకు ఐనా, సగటు ప్రేక్షకులకు ఐనా విజయం పై మమకారం ఎక్కువ. అపజయాలతో వున్న నటీనటులను, సాంకేతిక నిపుణులను త్వరగా మరచిపోతుంటారు. అలానే ఒక్క విజయం ఇచ్చిన వారిని పదే పదే స్మరించుకుంటూ వుంటారు. ఇప్పుడు ఆలా పరిశ్రమ కళ్ళల్లో పడిన నటుడు విజయ్ దేవరకొండ. ఎవడె సుబ్రహ్మణ్యం చిత్రంలో క్యారెక్టర్ ఆర్టిస్టుగా మెప్పించి కథానాయకుడిగా మారి పెళ్లి చూపులు చిత్రం చేసాడు. ఆ చిత్రం విడుదల తరువాత సృష్టించిన ప్రకంపనలు ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం ఉండదు.
పెళ్లి చూపులు తో సోలో హీరోగా తిరుగులేని విజయం అందుకున్న విజయ్ దేవరకొండ కి వరుస అవకాశాలు తలుపు తడుతున్నాయి. ఇప్పటికే ద్వారకా, అర్జున్ రెడ్డి చిత్రాలు నిర్మాణాంతర కార్యక్రమాలకు చేరుకోగా, రానున్న రెండు నెలలలో విజయ్ దేవరకొండ సంతకం చేసిన మరో నాలుగు చిత్రాలు సెట్స్ పైకి రానున్నాయి. నందిని రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కనున్న రొమాంటిక్ కామెడీ ఫిబ్రవరి నెలలో రెగ్యులర్ షూటింగ్ కి సిద్ధమవుతుండగా, బన్నీ వాసు-మారుతీ-వంశి ప్రమోధ్లు సంయుక్తం నిర్మిస్తున్న మరో చిత్రం చిత్రీకరణలో వుంది. పెళ్లి చూపులు నిర్మాతలతో వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో ఒక్క చిత్రం, భరత్ కమ్మ దర్శకత్వంలో మరో చిత్రాన్ని అంగీకరించాడు విజయ్ దేవరకొండ.
ఈ చిత్రాలు అన్ని ఒక దాని తరువాత మరొకటిగా 2017 లోనే ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. ఈ చిత్రాలలో ఏ ఒక్క చిత్రం ఆడినా విజయ్ దేవరకొండకి తదుపరి ఏడాది డైరీ కూడా బిజీ అయిపోయే అవకాశాలు పుష్కలంగా వున్నాయి.