నేటి తరం కథానాయకులలో అతి త్వరగా 50 చిత్రాలు పూర్తి చేసుకున్న నటుడు అల్లరి నరేష్. తన తండ్రి, ప్రముఖ దర్శకుడు ఈ.వి.వి.సత్య నారాయణ అకాల మరణం తర్వాత అల్లరి నరేష్ నట జీవితం గాడి తప్పింది. గతంలో ఆయన వరుస విజయాలతో ప్రేక్షకులను అలరిస్తూ, అడపా దడపా ఈ.వి.వి. దర్శకత్వం లో నటిస్తూ బెండు అప్పారావు వంటి ఘన విజయాలను పొందారు. కానీ 2012 లో విడుదలైన సుడిగాడు విజయం తర్వాత ఇప్పటికి నాలుగు సంవత్సరాలలో పది చిత్రాలలో నటించాడు అల్లరి నరేష్. కానీ ఏదీ ఆశించిన స్థాయి ఫలితాన్ని ఇవ్వలేకపోయాడు.
యముడికి మొగుడు, ఆక్షన్ త్రీడీ, కెవ్వు కేక, లడ్డు బాబు, జంప్ జిలాని, బ్రదర్ ఆఫ్ బొమ్మాలి, బంది పోటు, జేమ్స్ బాండ్, మామ మంచు అల్లుడు కంచు, సెల్ఫీ రాజా ఇలా ప్రతి సారి టైటిల్ తో అంచనాలు పెంచి చిత్రం విడుదల తర్వాత ఎదురు దెబ్బ తింటూనే ఉన్నాడు అల్లరి నరేష్. ఇప్పుడు అందరూ చేసి వదిలేసిన హారర్ కామెడీ నేపథ్యంలో ఇంట్లో దెయ్యం నాకేంటి భయం అనే చిత్రాన్ని త్వరలో ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నాడు ఈ యువ హీరో. మరి ఈ చిత్రం ఐనా విజయం సాధిస్తుందో లేక 11వ సారి కూడా అల్లరోడికి నిరాశే మిగులుతుందో చూడాలి.
ఇంట్లో దెయ్యం నాకేంటి భయం చిత్రానికి జి.నాగేశ్వర రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. ప్రముఖ నిర్మాత బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.