ఉత్తరాది పైత్యం చూపిస్తున్నారు....! 

Update: 2016-11-23 13:06 GMT

ఉత్తరాది వారికి, ముఖ్యంగా హిందీ భాషా రాష్ట్రాల వారికి దక్షిణాది అన్నా, ఇక్కడి భాషలన్నా చిన్నచూపు ఎక్కువే. ఇదే పైత్యం, అహంకారం బాలీవుడ్‌ వారికి కూడా నరనరాన నిండివుంది. ఇది ఎన్నోసార్లు నిరూపితం అయింది. అందుకే దక్షిణాది వారు హిందీ భాషను తమపై బలవంతంగా రుద్దడాన్ని ఎప్పటి నుంచో వ్యతిరేకిస్తున్నారు. ముఖ్యంగా తమిళనాడు ప్రజలు హిందీపై తమకున్న అసహనాన్ని ఎప్పటికప్పుడు గట్టిగానే చాటుతూ వస్తున్నారు. ఇక మన దక్షిణాది చిత్రాలన్నా, ఇక్కడి స్టార్స్‌ అన్నా బాలీవుడ్‌కు చిన్నచూపు ఉంది. దక్షిణాది స్టార్స్‌ హిందీలో విఫలం కావడానికి ఈ పక్షపాతం కూడా ఒక కారణంగా చెప్పుకోవచ్చు. కానీ మన వారికి మాత్రం ఎప్పుడు బాలీవుడ్‌ మీదనే ధ్యాస ఎక్కువ. అందుకే దూరపు కొండలు నునుపు అనే సామెతను కొందరు దీనికి ఉదాహరణగా చెబుతుంటారు. కాగా సౌత్‌ఇండియన్‌ సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌కు దేశ విదేశాల్లో కూడా ఎంతో ఫాలోయింగ్‌ ఉంది. ఆయనకు అన్ని భాషల్లోనూ అభిమానులున్నారు. మరో ముఖ్యంగా గమనించాల్సిన విషయం ఏమిటంటే రజనీకి బాలీవుడ్‌ చిత్రాల ప్రేక్షకుల్లో, అక్కడి సాధారణ సినీ అభిమానుల్లో కూడా ఎంతో క్రేజ్‌ ఉంది. అంతేకాదు... ఆయనకు బాలీవుడ్‌లోని పలువురు స్టార్‌ హీరోహీరోయిన్లలో కూడా ఎందరో అభిమానులున్నారు. కానీ ఈ విషయాన్ని ఒప్పుకోవడానికి మాత్రం వారికి అహం అడ్డొస్తుంటుంది. ఇక విషయానికి వస్తే శంకర్‌ దర్శకత్వంలో రజనీకాంత్‌, అక్షయ్‌కుమార్‌, అమీజాక్సన్‌లు ప్రధానపాత్రల్లో రూపొందుతున్న 'రోబో' సీక్వెల్‌ '2.0' చిత్రం బాలీవుడ్‌తో పాటు అన్ని భాషల్లో రూపొందుతోంది. కాగా ఈ చిత్రం ఫస్ట్‌లుక్‌, లోగో విడుదల ఇటీవల ప్రముఖ బాలీవుడ్‌ దర్శకనిర్మాత కరణ్‌జోహార్‌ ఆధ్వర్యంలో ముంబైలో వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి పలువురు బాలీవుడ్‌ ప్రముఖులు కూడా హాజరయ్యారు. కాగా ఈ వేడుకలో ఈచిత్రానికి తనకంటే విలన్‌గా నటిస్తున్న అక్షయ్‌కుమారేే నిజమైన హీరో అంటూ సభాముఖంగా రజనీ ఆయనను పొగడ్తలతో ముంచేసి తన పెద్దతనాన్ని చాటుకున్నాడు.

ఈ వేడుక ముగిసిన తర్వాత రజనీ బాలీవుడ్‌ మీడియా ప్రతినిధులతో ప్రశ్నోత్తరాల కార్యక్రమంలో పాల్గొన్నాడు. ఈ సందర్భంగా ఓ విలేకరి రజనీని ఉద్దేశించి...మీరు ఇండియా అంతా ఒక రేంజ్‌ సూపర్‌స్టార్‌.. మీ స్టార్‌డమ్‌ చాలా డిఫరెంట్‌. మీకు పలువురు స్టార్‌హీరోలే ఫ్యాన్లు. ఒకవేళ బాలీవుడ్‌లో మీ అంతటి స్టార్‌డమ్‌ ఉన్న హీరో ఎవరైనా ఉన్నారా? అంటే ఎవరి పేరు చెబుతారు? అని ప్రశ్నించాడు. దీనికి రజనీ 'నో కామెంట్‌' అని సమాధానం ఇచ్చాడు. ఎవ్వరి పేరు చెప్పినా మిగిలిన వారు హర్ట్‌ అవుతారని, అనవసరంగా ఎవరెవరినో హర్ట్‌ చేయడం ఇష్టం లేకనే రజనీ ఈ ప్రశ్నకు 'నో కామెంట్‌' చెప్పి జవాబు దాటవేశాడని అర్దమవుతోంది. కానీ బాలీవుడ్‌ మీడియా మాత్రం ఈ 'నో కామెంట్‌' సమాధానాన్ని వక్రీకరించి, రజనీ సమాధానానికి పెడార్దాలు తీస్తూ ఆయనపై తమకున్న అక్కసును చాటుకుంటోంది. రజనీ తనను మించిన స్టార్‌డమ్‌ ఎవరకి లేదనే ఉద్దేశ్యంతోనే ఇలా 'నో కామెంట్‌' అని చెప్పాడని, తనకు తానుగా ఆయన తనను మించిన వారు ఎవ్వరూ లేరనే భావనలో ఉన్నాడని, అందుకే అలా సమాధానం చెప్పాడని పెడార్ధాలు తీస్తూ తమ పైత్యం చాటుకుంటున్నారు. ఈ విషయంలో బాలీవుడ్‌ మీడియా వైఖరిని చాలామంది సినీ విశ్లేషకులు తప్పుపడుతున్నారు. ఇలా బాలీవుడ్‌ మీడియా తమ అభిమాన హీరోపై దుష్ప్రచారం చేయడాన్ని ఆయన ఫ్యాన్స్‌ కూడా తట్టుకోలేకపోతున్నారు.

Similar News