‘హ్యూమానిటీ ఎగైనస్ట్ టెర్రర్’ పేరిట ఓ సంస్థ అమెరికాలోని న్యూజెర్సీలో ఓ కార్యక్రమాన్ని ఏర్పాటుచేస్తోంది. పరోక్షంగా ఇది డొనాల్డ్ ట్రంప్‌కు ప్రచార కార్యక్రమం వంటిది అనే వదంతులు అమెరికా అంతటా వ్యాపిస్తున్నాయి. ఈ నిదుల సేకరణ కార్యక్రమాన్ని ఏర్పాటుచేసిన సంస్థ.. పలువురు భారతీయ ఫిలిం సెలబ్రిటీలను కూడా ఆహ్వానించింది. కార్యక్రమానికి ఉన్న అతిథుల్లో ట్రంప్ కూడా ఉన్నారు. సహజంగానే ఈ వేదిక మీదినుంచి ట్రంప్ తన ఎన్నికల ప్రచారం కూడా చేసుకుంటారు. .. ఇదీ అసలు కార్యక్రమానికి సంబంధించిన నేపథ్యం.
ఈ కార్యక్రమంలో షెడ్యూలు ప్రకారం.. మన దేశం నుంచి ప్రభుదేవా, మలైకా అరోరా, సోఫీ చౌదరి, రాంచరణ్ తదితరులు పాల్గొనాల్సి ఉంది. ఇలియానాను కూడా నిర్వాహకులు ఆహ్వానించారు. అయితే ఇలియానా వారి ప్రపోజల్ ను నిర్ద్వంద్వంగా తోసిపుచ్చింది. ‘ నేను మీ కార్యక్రమానికి రాను.. ట్రంప్‌కు అనుకూలంగా ప్రచారం కూడా చేయను’ అంటూ ఇలియానా తెగేసి చెప్పింది.
అయితే ముందుగా కార్యక్రమానికి రావడానికి ఒప్పుకున్న రాంచరణ్ చివరినిమిషంలో మానుకున్నారు. అయితే ఆయన ఇలియానాలాగా కార్యక్రమం యొక్క సిద్ధాంతాలు, ట్రంప్ కు తాను మద్దతు ఇవ్వడం, ఇవ్వకపోవడం అనే అంశాల ప్రాతిపదికగా కాదు.. తన వ్యక్తిగత ఇబ్బందుల వల్ల రాలేకపోతున్నట్టు ట్వీట్ పెట్టాడు. ఇది ట్రంప్ ఎన్నికల ప్రచార కార్యక్రమం అనే క్లారిటీ ఈ హీరోకు లేదా.. ? కనీసం ఇలియానా కు ఉన్న క్లారిటీ అయినా రాంచరణ్ కు లేకుండా పోయిందా అని పలువురు అనుకుంటున్నారు. కార్యక్రమానికి తాను రాకపోయినా..పూర్తి మద్దతు ఉంటుందని.. తన అభిమానులు అందరూ హాజరు కావాలని రాంచరణ్ పిలుపు ఇచ్చారు. మరి ఇండైరక్టుగా ట్రంప్ కు జై కొడుతున్నట్లేనా..? ఆయన ఆ విషయంలో కూడా క్లారిటీ ఇస్తే బాగుంటుంది.