అవకాశం రావడంలో అన్న ఎఫెక్ట్ లేదు

Update: 2016-11-12 10:42 GMT

సినీ నేపధ్యం వున్న కుటుంబం నుంచి వచ్చిన యువ కథానాయకుడు అయినప్పటికీ అభిమానుల సంఖ్యా పరంగాను, ప్రేక్షకాదరణ, వసూళ్ల విషయంలోనూ మిగిలిన యువ కథానాయకుల తో పోలిస్తే వెనుక వరుసలోనే వున్నాడు అల్లు శిరీష్. ఈ మధ్యనే దర్శక రచయిత పరశురామ్ తెరకెక్కించిన శ్రీరస్తు శుభమస్తు చిత్రంతో తొలి విజయాన్ని అందుకున్నాడు అల్లు శిరీష్. కాని ఆ విజయం తెలుగు రాష్ట్రాలకే పరిమితం ఐయ్యింది తప్ప ఇతర రాష్ట్రాలకు చేరలేదు. కాని అనూహ్యంగా మళయాళ చిత్రంలో మోహన్ లాల్ తో కలిసి నటించే అవకాశం అల్లు శిరీష్ దక్కించుకోవటంతో అందరూ అల్లు అర్జున్ ప్రమేయంతోనే ఈ అవకాశం వచ్చింది అని అనుకున్నారు. అల్లు అర్జున్ కి తెలుగు రాష్ట్రాల్లో వున్న గుర్తింపుకి సమానంగా మలయాళం లోను ఉండటమే ఇందుకు కారణం.

కాని ఈ వార్తలు అన్ని అపోహలే అని తేల్చి చెప్పేసాడు అల్లు శిరీష్. తాజాగా అల్లు శిరీష్ ఇచ్చిన ఒక పత్రికా ఇంటర్వ్యూలో తన మళయాళ చిత్ర అవకాశం గురించి వేసిన ప్రశ్నకు సమాధానంగా "మలయాళంలో 1971 బియాండ్ బోర్డర్స్ అనే చిత్రంలో వార్ ట్యాంక్ కమాండర్గా కీలక పాత్ర పోషిస్తున్నాను. ప్రస్తుతం చిత్రీకరణ రాజస్థాన్లోని అరుణ్ ఘర్ ఆర్మీ బేస్ లో జరుగుతుంది. ఈ చిత్ర దర్శకుడు మేజర్ రవి హైదరాబాద్ వచ్చినప్పుడు ఒకసారి కలిసాను. అప్పుడు మా మధ్య వచ్చిన సినిమా చర్చల్లో చరిత్రకు సంబంధించిన కథలు కొన్ని చర్చించుకున్నాము. ఆ కారణంగా ఈ పాత్రకు నటుల ఎంపిక జరుగుతున్నప్పుడు మేజర్ రవికి నేను గుర్తువచ్చి నాకు అవకాశం కల్పించారు. అందరూ అనుకున్నట్లు బన్నీ ప్రమేయంతో మలయాళం సినిమా అవకాశం రాలేదు." అని వివరించాడు అల్లు శిరీష్.

Similar News