Theatres Closed: థియేటర్ల బంద్ పై పొలిటికల్ టర్న్
తెలుగు రాష్ట్రాల్లో సినిమా థియేటర్ల బంద్ పొలిటికల్ టర్న్ తీసుకుంది
తెలుగు రాష్ట్రాల్లో సినిమా థియేటర్ల బంద్ పొలిటికల్ టర్న్ తీసుకుంది. జూన్ 1 నుంచి థియేటర్లు మూసివేయాలని ఎగ్జిబిటర్లు ఇటీవల తీసుకున్న నిర్ణయంపై సినిమాటోగ్రఫీ, పర్యాటక శాఖల మంత్రి కందుల దుర్గేశ్ స్పందించారు. థియేటర్ల బంద్ నిర్ణయం వెనుక ఎవరున్నారో తేల్చాలని హోం శాఖ ముఖ్య కార్యదర్శిని ఆదేశించారు. థియేటర్ల బంద్‌కు సంబంధించి ఎగ్జిబిటర్లు తీసుకున్న నిర్ణయం వెనుక ఉన్న కారణాలపై సమగ్ర విచారణ జరపాలని మంత్రి కందుల దుర్గేశ్ హోం శాఖ ముఖ్య కార్యదర్శి కుమార్ విశ్వజిత్‌ను ఆదేశించినట్లు జనసేన పార్టీ తెలిపింది.
తెలుగు రాష్ట్రాల ఎగ్జిబిటర్లు జూన్ 1 నుంచి థియేటర్లను మూసివేయనున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం సినిమాలను అద్దె ప్రాతిపదికన ప్రదర్శించడం వల్ల తమకు సరైన ఆదాయం రావడం లేదని, మల్టీప్లెక్స్‌ల తరహాలోనే ఉండాలని సింగిల్ థియేటర్ల యాజమాన్యాలు డిమాండ్ చేస్తున్నారు. నిర్మాతలు ఇప్పటికే ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లతో చర్చలు జరిపారు. తదుపరి చర్చల కోసం శనివారం మరోసారి సమావేశం కానున్నారు.