నటశేఖరుడి నటప్రస్థానం.. శివరామకృష్ణ మూర్తి నుండి కృష్ణగా..

తేనె మనసులు సినిమాతో సినీ రంగంలోకి అడుగుపెట్టారు కృష్ణ. తొలి అడుగులోనే సాహసం చేశారు. అగ్రహీరోలు రాణిస్తున్న..

Update: 2022-11-15 05:09 GMT

krishna hit movies

సూపర్ స్టార్ కృష్ణ గా పిలుపుచుకుంటున్న కృష్ణ పూర్తి పేరు.. ఘట్టమనేని శివరామకృష్ణ మూర్తి. సినీరంగంలోకి అడుగుపెట్టాక.. ఆయన కృష్ణగా పేరు పొందారు. కృష్ణగానే అభిమానులను సంపాదించుకున్నారు. ఆయనకు ఉన్న అభిమాన సంఘాలు మరే హీరోకి లేరంటే అతిశయోక్తి కాదు. బుర్రిపాలెం బుల్లోడికి ఏకంగా 2500 అభిమాన సంఘాలున్నాయి. 350కి పైగా సినిమాల్లో నటించిన తొలి తెలుగు హీరోగా రికార్డు సృష్టించారు. అంతే కాదు.. జేమ్స్ బాండ్, కౌ బాయ్ పాత్రలు వేసి.. తెలుగు జేమ్స్ బాండ్, తెలుగు కౌ బాయ్ గా పిలిపించుకున్నారు.

తేనె మనసులు సినిమాతో కృష్ణ హీరోగా సక్సెస్ సాధించారు. తొలి అడుగులోనే సాహసం చేశారు. అగ్రహీరోలు రాణిస్తున్న సమయంలో.. దర్శకుడు ఆదుర్తి సుబ్బారావు కొత్తవారితో సినిమాలు చేయాలని చూస్తున్న రోజుల్లో కృష్ణ ఇండస్ట్రీకి వచ్చారు. కలర్ ప్రింట్ సినిమా చేయాలన్నది వారి ఆలోచన. వద్దని ఎంతమంది చెప్పినా వినలేదు. తేనె మనసులు సినిమా పూర్తి చేశారు. విడదలయ్యాక ఆడియన్స్ నుండి అనూహ్యమైన స్పందన వచ్చింది.

గూఢచారి 116తో ఆంధ్రా జేమ్స్ బాండ్ గా మారారు. తెలుగులో వచ్చిన తొలి స్పై సినిమా ఇదే కావడం విశేషం. కృష్ణకి నట శేఖర అనే బిరుదు ఉంది. కానీ.. డేరింగ్ అండ్ డాషింగ్ హీరోగా పిలుచుకోవడమే అభిమానులకు ఇష్టం. ఆ తర్వాత వచ్చిన సింహాసనం ది మరో రికార్డు. తెలుగులో వచ్చిన తొలి 70 ఎంఎం సినిమా అది. మోసగాళ్లకు మోసగాడు సినిమాతో.. ఆంధ్రా కౌ బాయ్ గా పేరుగాంచారు కృష్ణ. అప్పట్లో కౌ బాయ్ సినిమా అంటే.. భారీ బడ్జెట్, గుర్రపు స్వారీలు ఉండాలని.. అవన్నీ కృష్ణ వల్ల కాదన్నారట చాలా మంది. కానీ అవేమీ పట్టించుకోకుండా మరోసారి సాహసం చేసి.. సక్సెస్ అయ్యారు.

1965 నుండి 2004 సంవత్సరం వరకూ గ్యాప్ లేకుండా బ్యాక్ టు బ్యాక్ సినిమాలు తీసిన ఘనత కృష్ణకే సొంతం. ఐదున్నర దశాబ్దాల కాలంపాటు తెలుగు చిత్రసీమను ఏలిన ఆయన.. 1972లో అత్యధికంగా 18 సినిమాలను విడుదల చేశారు. సినీ కెరీర్ లో కృష్ణ చాలా ఘనతలు, రికార్డులు సాధించారు. 50 మల్టీస్టారర్ సినిమాలు, కేఎస్ దాసు దర్శకత్వంలో 31 సినిమాలు తీశారు. అతిలోక సుందరి శ్రీదేవితో 31, విజయనిర్మలతో 50, జయప్రదతో 43 సినిమాల్లో హీరోగా నటించారు. 7 సినిమాల్లో త్రిపాత్రాభినయం, 25 సినిమాల్లో ద్విపాత్రాభినయం చేశారు. 16 సినిమాలకు ఆయనే దర్శకత్వం వహించారు. తెలుగు నుండి తమిళంలోకి 20 సినిమాలను డబ్ చేశారు.
1983లో కృష్ణ నటించిన 6 సినిమాలు 100 రోజులు ఆడి ఘన విజయం అందుకున్నాయి. ఒక ఏడాదిలో 6 సినిమాలు 100 రోజులు పూర్తిచేసుకున్న తొలి భారతీయ హీరో కృష్ణ. ఆయనతో 105 దర్శకులు, 52 మంది సంగీత దర్శకులు పనిచేశారు. సెకండ్ ఇన్నింగ్స్ లోనూ తండ్రిగా నటించి ప్రేక్షకుల మన్ననలు పొందారు. ఆఖరిగా కృష్ణ శ్రీశ్రీ సినిమాలో నటించారు. ఆ సినిమా విజయనిర్మల-కృష్ణ భార్యభర్తలుగా నటించగా.. విజయనిర్మల కుమరుడు నరేష్ పోలీస్ గా నటించారు. ఆ తర్వాత ఆయన ఆరోగ్యం సహకరించకపోవడంతో.. నటనకు దూరంగా ఉన్నారు.




Tags:    

Similar News