క్షమాపణలు చెప్పిన విఘ్నేష్ శివన్-నయనతార

వివాహానంతరం శుక్రవారం తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి దర్శనార్థం వచ్చారు. ఈ సందర్భంగా నయనతార ఒక వివాదంలో చిక్కుకున్నారు.

Update: 2022-06-11 05:34 GMT

నయనతార, విఘ్నేశ్ శివన్‌ లు పెళ్లి వేడుక తర్వాత నేరుగా తిరుమల విచ్చేసి, శ్రీవారి కళ్యాణోత్సవ సేవలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కొందరు భక్తులు, అభిమానులు ఈ జంటను చూసేందుకు, ఫొటోలు తీసుకునేందుకు ఆసక్తి కనబరిచారు. నాలుగేళ్లుగా ప్రేమలో ఉన్న నయన్, విఘ్నేశ్‌ శివన్‌ గురువారం (జూన్ 9) ఉదయం కుటుంబసభ్యులు, సన్నిహితుల సమక్షంలో పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు. వివాహానంతరం శుక్రవారం తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి దర్శనార్థం వచ్చారు. ఈ సందర్భంగా నయనతార ఒక వివాదంలో చిక్కుకున్నారు. ఆమె మాడ వీధుల్లో చెప్పులు వేసుకుని నడిచారు. ఆమె భర్తతో పాటు ఇతరులందరూ చెప్పుల్లేకుండానే నడిచారు. నయనతార చెప్పులు ధరించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఈ వివాదంపై వివరణ ఇస్తూ విఘ్నేశ్‌ శివన్‌ తాజాగా ఓ లేఖ విడుదల చేశారు. దేవుడిపై తమకు అపారమైన నమ్మకం, భక్తి ఉందని.. తాము తెలియక చేసిన తప్పుకు క్షమించాలని కోరారు. 'అందరికీ నమస్కారం.. నిజానికి మేము తిరుమలలోనే వివాహం చేసుకోవాలనుకున్నాం కానీ కొన్ని కారణాల వల్ల చెన్నైలో చేసుకోవాల్సి వచ్చింది. దీంతో వివాహం అయిన వెంటనే కనీసం ఇంటికి కూడా వెళ్లకుండానే శ్రీవారిని దర్శించుకోవడానికి తిరుమలకు వెళ్లాము. దర్శనం ముగిసిన వెంటనే ఆలయం ముందు ఫొటో తీసుకోవాలని భావించాము. అయితే భక్తులు భారీగా ఉండడంతో అక్కడి నుంచి వెళ్లి, మళ్లీ రద్దీ తగ్గగానే తిరిగి వచ్చాము. ఫొటోషూట్‌ వెంటనే పూర్తి చేయాలనే గందరగోళ పరిస్థితుల్లో మా కాళ్లకు చెప్పులు ఉన్నాయనే విషయాన్ని మర్చిపోయాం. దేవుడిపై మాకు అపారమైన నమ్మకం ఉంది. మేము ఎంతగానో ఆరాధించే స్వామి వారిని అవమానించడానికి ఇలా చేయలేదు. దయచేసి మమ్మల్ని క్షమించండి'' అని విఘ్నేశ్‌ శివన్‌ శివన్ సోషల్ మీడియాలో పోస్టు పెట్టారు.


Tags:    

Similar News